‘అన్నం’ చిన్నతనమా..? Telugu/Home


తెలుగు, కన్నడ, తమిళ భాషలు - ప్రాచీనత విషయంలోనూ గొప్పతనం విషయంలోనూ ఒకదానికొకటి తీసిపోని భాషలు. కానీ సంఖ్యాపరంగా, విస్తరించి ఉన్న ప్రాంతపరంగా చూస్తే మిగిలిన రెండు భాషల కంటే తెలుగు చాలా పెద్దది. కన్నడ, తమిళ భాషీయులను కలిపి లెక్కగడితే కూడా తెలుగువారిలో సగం కంటే తక్కువ. అట్లాంటి తెలుగుభాష ఇప్పుడు ఏ పరిస్ధితుల్లో ఉంది? తెలుగువారిలో భాషా చైతన్యం, స్వాభిమానం ఎట్లా ఉన్నాయి? అని పరిశీలించుకొంటూ వ్రాయటం మొదలుపెడుతున్నాను.

భాషాజ్ఞానం ఎవరికైనా ఇంటినుంచే మొదలవుతుంది. పరిసరాల ప్రభావంతో పెరిగి, అనుభవాల వలనా, అధ్యయనం వలనా విస్తరిస్తుంది. నేను ఇంట్లో నుంచి మొదలుపెడుతున్నాను.

....2004, డిసెంబరు నెల. హోసూరు ప్రాంతానికి చెందిన ఇరవైమంది యువకులతో కలిసి, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఉన్నాము. హై.వి.వి., తెలుగుశాఖ వారు తెలుగువాణి ప్రచారకులకు శిక్షణ శిబిరాన్ని నడుపుతున్నారు. పది దినాల శిక్షణలో ఒకనాడు హైదరాబాదు నగరాన్ని చూపించినారు. తెల్లవారి నుంచీ రకరకాల చోట్ల తిరిగి నడిపొద్దుకు ‘సాలార్‌జంగ్‌ మ్యూజియం’ చూడడానికి వచ్చినాము. మూడు నాలుగంతస్ధుల ఆ భవనంలోని వింత వింత వస్తువులను కళ్లూ, నోరూ వెళ్లబెట్టుకొని చూస్తున్నాము. క్రిష్టమస్‌ పండుగ సెలవులనుకొంటాను. పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. గంటల గడియారం దగ్గరకొచ్చేసరికి నాకు అలత వచ్చింది. ఆ తొక్కిడిలో తిరగలేక నేను అక్కడే కూర్చున్నాను. నా నేస్తగాళ్ళందరూ ఇంకా పై అంతస్ధుకు పోయినారు. నేను కూర్చున్న గది ఖాళీ అయింది. బల్లలపై పలుచగా ఉన్నారు మంది.

బల్లకు జారిగిలబడినాను. అలత వలన అరగన్ను బడింది. నా పక్కన ఒక కుటుంబం వచ్చి కూర్చునింది. ఆలూమొగుడు, చిన్నపిల్లలిద్దరు. గలగల తమిళంలో మాట్లాడుకొంటున్నారు. కాలుకట్టుకొనయినా ఉండగలను గానీ నోరు కట్టుకొని ఉండడం నావల్ల కాని పని.

పలుకరించాను వారి భాషలోనే, ‘ ఏ వూర’ని. వేలూరు జిల్లా... కుటుంబ విహారయాత్రకు వచ్చినారు. వేలూరు జిల్లాలో తెలుగువాళ్ళు బాగా ఎక్కువ కదా. అదీకాక చిత్తూరు జిల్లాను ఆనుకొని ఉంటుందాయె.తెలుగు తెలుసా?’ అనడిగాను - ఇంకేం, రానే వచ్చింది బదులు. ఆ దంపతుల్లో మొగుడి తల్లిభాష తెలుగే. ఇష్టపడి తమిళమ్మాయిని చేసుకొన్నాడు. పిల్లలకు తెలుగు తెలుసా ?’ అడిగినా కుతూహలంగా.

‘తెలీదండీ! పిల్లల బాగోగులను పట్టించుకొనేది తల్లేకదా. కాబట్టి వాళ్ల తల్లిమాటలనే వాళ్లకు నేర్పుతున్నాము.నేను కూడా వాళ్ల కోసం తమిళమే మాట్లాడుతున్నాను.’

ఆయన ‘బదులు’ నాకు సమంజసమేననిపించింది. కాసేపు తమిళనాడు ముచ్చట్లు అయినాక , ఆ కుటుంబం వేరే వైపు పోయినారు. వాళ్లటు పోతుండగానే ఇంకొక కుటుంబం వచ్చింది అదే చోటుకు. ఈ కుటుంబంలో ఆలూ , మొగుడు, చిన్నపాప. మాటలన్నీ కన్నడంలో సాగుతున్నాయి. నా పలకరింపు ఉండనే ఉంది కదా! హోసూరును ఆనుకొనే ఉన్న కోలారు జిల్లా వాసులు. కోలారు వాళ్లంటే కచ్చితంగా తెలుగు వచ్చి ఉంటుంది. ‘కోలారు జిల్లాలో తెలుగు కనబడదు, తెలుగు తప్ప విబడదు’ అని ఒక నానుడి ఉంది. ఈ బేడలేమీ ఇప్పుడు ఉడకడం లేదు లెండి. ఈ తరం పిల్లలు వేగంగా తెలుగుకు దూరమవుతున్నారక్కడ కూడా.

ఈ కుటుంబం వివరాలకొస్తే వీరు ‘ఒక్కలిగ’ కులం వారు. ఒక్కలిగ కులంలో కన్నడ, తెలుగు శాఖలు రెండూ ఉన్నాయి. ఈ దంపతుల్లో మొగునిది ‘మొరసు ఒక్కలిగ’ శాఖ, అంటే కన్నడ శాఖ. పెండ్లముది ‘వేళ్లిచ్చే ఒక్కలిగ’శాఖ, అంటే తెలుగువారు. కుటుంబంలోని చిన్నపాప తల్లిదేమో తెలుగు, తండ్రిది కన్నడం. పాపకి తెలుగురాదు. ఆ తల్లి చెప్పిన కారణం ఆమె మాటల్లోనే వినండి.

‘పాప పుట్టింది, పెరుగుతున్నది, పెరగబోయేది నా అత్తవాళ్ళింట్లోనే కదా ! నా అత్తవాళ్లిట్లో అందరూ కన్నడం మాట్లాడేటప్పుడు, పాప కూడా కన్నడం మాట్లాడడమే మంచిది. పెండ్లయిన మీదటిక పుట్టింటి ఆచార వ్యవహారాలను వదిలిపెట్టి అత్తింటి ఆచారాలను అనుసరిండమే మన తీరు. అట్లే నేను కూడా కన్నడానికి మారినాను.’

ఈవిడ చెప్పిందీ సమంజసంగానే ఉంది. బిలబిల మంటూ మా జట్టు నేనున్న దగ్గరకు వచ్చేసింది. ఇక బయలుదేరబోతున్నాము. నా వెనుక చక్కటి ఇంగ్లీషు సంభాషణ. తిరిగి చూస్తే అయిదారేండ్ల బాబుతో అమ్మానాన్నల ఆంగ్లం మాటలు. కాస్త పరిచయంతోనే తేలిపోయింది. వారిది గుడివాడ అని. ఇద్దరూ తెలుగువారే. బాబుతో తెలుగులో మాట్లాడ్డం లేదేమిటి? అంటే, ‘ లాంగ్వేజ్‌ అనేది కేవలం కమ్యూనికేట్‌ చేయడానికి, లైఫ్‌లో డెవలప్‌ కావడానికి పనికొచ్చేది గ్రేట్‌ లాంగ్వేజ్‌. టుడే వరల్డ్‌ అంతా ఇంగ్లీషు చుట్టూ తిరుగుతుంటే, మనం సెంటిమెంట్‌తో తెలుగు తెలుగు అనడం ఫూలిష్‌నెస్‌ ’ అంటూ చిన్న ఉపన్యాసం దంచినాడు. ఆ మహాతల్లి అయితే నన్ను పురుగును చూసినట్లు చూసింది. వీళ్ల వాదన కూడా సమంజసమేనా ?

ఇంకొక అనుభవాన్ని వినండి. భాషకు సంబంధించినదే ఇది కూడా. సుమారు మూడేండ్ల కిందట జరిగిన ముచ్చట. నా స్నేహితులు పావగడ దాసేగౌడ, తుముకూరు తిప్పేస్వామి, కోలారు శివారెడ్డి, చిక్కమగళూరు సతీ,్‌ మామూరు శ్రీను, నా తమ్ముడు ఏలూరు శ్రీను, మామ కొడుకు శ్రీనాథులతో కలిసి మైసూరు నుంచి కూర్గు యాత్రకు బయలుదేరినాను. అందరమూ అంతో ఇంతో తెలుగు పిచ్చోళ్లమే. దాసే, తిప్పే, సతీశ్‌లు కర్నాటక వాళ్లయినా తెలుగంటే బాగా ఇష్టపడేవాళ్లు.

మైసూరు నుంచి కూర్గు జిల్లాలో కావేరి పుట్టే బ్రహ్మగిరుల వరకు మూడు దినాలు సాగిన మా యాత్రలో ఎన్నో కొత్త అనుభవాలు! మైసూరు, కూర్గు జిల్లాలలో తెలుగువారిని, తెలుగు పల్లెలనూ జల్లెడపట్టి గాలించినాము. కన్నడిగులే బాగా తక్కువగా ఉండే కూర్గు జిల్లాలో స్ధానిక తెలుగు పల్లెలున్నాయి. మేము పోయింది కూర్గు వరకే అయినా, దానిని ఆనుకొని ఉండే కేరళ , కాసరగోడు జిల్లాలోని తెలుగు పల్లెల వివరాలు కూడా తెలిసినాయి. సరే, విషయానికొద్దాము.

తిరుగు ప్రయాణంలో మైసూరుకు గంట, గంటన్నర దూరంలోని హోసూరులో ఒక స్నేహితుని ఇంటికి పోవలసివచ్చింది. ఆ పొద్దు వాళ్లు కొత్త ఇంట్లో చేరబోతున్నారు. చక్కగా బంతి భోజనాలు, బఫే తిండి కాదు. నంజరకూటి వారికి మిద్దెమీద, పప్పుకూటి వారికి ఇంట్లో వడ్డనలు. వడ్డించే వారంతా కమ్మగా కన్నడంలో పలుకరిస్తూ పుళియోగిరె, బిళి అన్న, తుప్ప, సారు, పల్య, తిళి మొసరు, నీరు అంటూ వడ్డిస్తున్నారు. కుటుంబసభ్యులు, చుట్టాలు వడ్డనకు దిగినారు. వీరిది కన్నడ దేవాంగుల కుటుంబం. కుటుంబంలో అందరూ పెద్ద చదువులు చదువుకొన్నవారే. అయినా తల్లిభాషను వదలలేదు.

నెల్లూరు జిల్లా పొదలకూరు దగ్గరున్న చిన్న ఊరు లింగంపల్లి. మెట్టప్రాంతం. రెండేండ్ల క్రిందట ఆ ఊర్లో ఒక పెండ్లికి పొయినాను. నేను పెండ్లి వారి చుట్టాన్ని. పెండ్లికి ముందునాడు మేడమీద భోజనాలు. బంతి భోజనాలే. తొలివాయి పలావన్నం వడ్డనయింది. ‘ఓట్రేచు, ఓట్రేచు ’ అంటా తిరుగుతున్నాడు రమణన్న.

‘రమణన్నా ఏందిరా అదా?’ అడిగినాను. ‘ఓట్రేచబయా’ రమణన్న బదులు. కుతూహలంతో రమణన్న చేతిలోని గిన్నెలోకి చూస్తే అన్నం. నవ్వురాలేదు. బాదేసింది. నాలుగయిదు తరగతుల వరకే చదివిన రమణన్న నోట్లో పడి నలిగిన వైట్‌రైసే, ఓట్రేచయింది.

‘అన్నమనేమినా?’బాధను మింగి అడిగినాను.

‘నువ్వు బలేవోడివిలే. అన్నమంటే ఆడపెళ్లోళ్లముందు కీతా అయిపోమా’ గబగబా బదులిచ్చి దెబగుబా పాయినాడు రమణన్న.

ఇదీ ఇంటి స్ధాయిలో మనం తల్లిభాషను నిలబెట్టుకొంటున్న తీరు!

స.వెం. రమేశ్‌

‘తెలుగువాణి’ ధర్మకర్త