(లంకా శివరామ ప్రసాద్)
'శ్రీభూ' అని సిరులూదకుండానే, అశుభప్రదమైన శ్లోకంతో ఈ వ్యాసాన్ని ప్రారంభిస్తాను. ఎందుకంటే, మంగళకరమైన విషయాలతో లెక్కకు మించిన వ్యాసాలిప్పటికే విచ్చేసి మన తెలుగువెలుగుల్ని తెగ విరజిమ్మేశాయి గనుక. అన్ని గొడవలకూ మూల కారణం ఆర్థికపరమైన జంఝాటనలే అన్నట్లు ఇదీ అంతే కదా! "మూర్థ్ని వంశలతా దీనాం సంభవో వయసాం తథా నీలయో ముండతో కాక గృద్థ్రా ద్వైః పరివారణమ్ తథా ప్రేత పిశాచస్త్రీ ద్రవిడాంధ్ర గవాశనైః''
-అష్టాంగ హృదయం-వాగ్భటుడు- (శరీరస్థానం-6-48)
శిరస్సు నందు వెదురుతీగలు మొలుచుట, పక్షులు గూళ్ళు కట్టుట, కాకులు గద్దలు చుట్టూరా పరివేష్టించుట, ప్రేత, పిశాచ, స్త్రీ, ద్రావిడ, ఆంధ్ర, గోమాసం భక్షకులు తనను చుట్టుముట్టినట్లు కల వచ్చిన అది అశుభమని ఎరుగవలెను.
ఆంధ్రులంటే ఆర్యులకెంత భయమో మనకు దీనివలన ఓ రకంగా అర్థమవుతోంది. వాళ్ళు ఆంధ్రుల్ని, ద్రావిడుల్ని, ప్రేత, పిశాచ, ఆర్యస్త్రీలతో సమానంగా గౌరవించేవారని కూడా సరిపెట్టుకోవచ్చును. ఆంధ్రులూ, ద్రావిడులూ ఆ రకం గా సమాన ప్రతిపత్తికలవారైతే మనకీ నిమ్నస్థాయి ఎలా వచ్చింది? వాళ్ళు బాగా అరవగలవారు కనుక వారికాపేరూ, మనకు అరవడమూ కరవడమూ చేతకాక అంధకారంలో ఉండిపోవడం చేత మనకీ పేరు వచ్చిందనేది నిన్నమొన్నటి వరకూ మనమున్న అంధకారాన్ని బట్టి నిజమేమో అనిపిస్తుంది. అమరకోశంలో ఆంధ్రప్రసక్తిలేదు. హిమాలయాలకు దక్షిణాన, దక్షిణ సముద్రానికి ఉత్తరాన ఉండి, వర్షపాతము ఎక్కువగా ఉన్న ప్రాంతమే భారతవర్షం. ఈ దేశంలో ఈశాన్య దిక్కునుండి నైరుతి మూలకు ప్రవహించుచూ పడమటి సముద్రమున కలియు నదిపేరు శరావతి. శరావతీ నదికి దక్షిణమున ఉన్నది దక్షిణదేశము. ఉత్తరమున ఉన్నది ఉదీచ్య ము. శిష్టాచారరహితమైన కామరూపాది దేశములు మ్లేచ్ఛదేశములు. హిమాలయములకు, వింధ్యపర్వతాలకు వినశన ... మధ్యనున్నది మధ్యదేశము. దీనిలో ఆర్యులు, పుణ్యులు, ధార్మికులు నివసిస్తారు.
'అంధకారో స్త్రియాం-ధ్వాన్తం తమిస్రం తిమిరం తమః' అంధకారమే చీకటి అనుకుంటే అంతకంటే అధ్వాన్నమైనది తమిస్ర, తిమిర, తమస్సులు. కాబట్టి వాళ్ళు కటిక చీకటిలో అప్పట్లో ఉన్నా, ఇప్పుడు కాస్త వెలుగు దొరకంగానే అందిపుచ్చుకున్నారు తమిల్ తంబులు. డాక్టర్ వరదరాజన్ రచించగా తిమ్మావఝల కోదండరామయ్యగారు అనువదించిన తమిళ వాఙ్మయ చరిత్రములో (1982) క్రీస్తుపూర్వము 500నాటికి సంగసాహిత్యము మొదలైందని వారు ఘంటాపథంగా చెప్పియున్నారు. ఇంచుమించు ఆ కాలంలోనే (క్రీ.పూ. 3 శతాబ్దం) తోల్కాప్పియనార్ వ్రాసిన తోల్కాప్పియం అనే లక్షణగ్రంథములో ఉత్తరమున వేంకటాచలము నుండి దక్షిణమున కన్యాకుమారి అగ్రమువరకూ తమిళము వ్యాపించి ఉన్నదని వ్రాసినారు. ప్రాచీన ద్రావిడభాషనుండి ఉత్తరభారతదేశమున ప్రాకృతము, పాళీభాషలేర్పడగా అక్కడక్కడ కోలమి, పార్జి, నాయ కి, కు, కువి, ....., మాల్టా, ఒరోవన్, గదబ, ...., బ్రాహుయి అనుభాషలు ద్రావిడభాషకు చెందినవిగా శాస్త్రజ్ఞులు విశ్లేషించారు. తిరుపతి కొండకు ఉత్తరముగా ఉన్నవారుతెలుగువారైరి. కాగా కరునాట్టు తమిళు కన్నడముగా, తుళునాట్టు తమిళు తుళుగా, మలైనాట్టు తమిళు మలయాళముగా వ్యవహరించబడినవని కొందరి అభిప్రాయం. తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు భాషలలో సుమారు అయిదువేల శబ్దాలు ఇంకను ఉమ్మడిగానే ఉన్నాయి.
ఇ.యన్.ఫాలైజ్ తన 'మానవ వంశవృక్షం' 'మానవ తెగలు' అన్న వ్యాసాలలో కొన్ని అద్భుత విషయాలను వెల్లడించాడు.
కోతులు, వాలిడుల కన్నా మానవుడు అతివేగంగా అభివృద్ధి చెందడానికి కారణాలు 1. బైపెడలిజం -రెండు కాళ్ళపై నిలబడగలగడం 2. స్టీరియో స్కోపిక్ విజన్- చూపులో తీక్షణత, నిశ్చలత్వం 3.బొటనవేలు అభివృద్ధి-అపోజింగ్ థంబ్. ఆఫ్రికా అడవులనుంచి నాలుగున్నర మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన మానవుల వలస ఆహారపు అన్వేషణలో లక్షసంవత్సరాల కొకసారి వచ్చి 25-30వేల ఏళ్ళుండే మంచుయుగాల అంచులవెంబడి చస్తూ బతుకుతూ ఆఖరి మంచుయుగం 45వేల సంవత్సరాల క్రితం ప్రారంభం కాగా ఏర్పడిన ల్యాండ్ బ్రిడ్జిలవలన ఆసియానుంచి మానవజాతి అమెరికా, ఆస్ట్రేలియాలాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి క్రీ.శ. 1000 సంవత్సరాల వరకూ స్థిరపడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితులలోనే వాతావరణాన్ని బట్టి శరీరవర్ణాల్లో మార్పులు రావడం, రాతిపనిముట్ల వాడకంలో నైపుణ్యం వృద్ధి చెందడం గోడలపై చిత్రాలు (35000 సం), వ్యవసాయం, పశుపోషణ మొదలై దేశద్రిమ్మరి మానవుడిలో కొంద రు స్థిరనివాసులు కాగా గ్రామాలు ఏర్పడ్డాయి. పదకొండువేల సంవత్సరాలప్పుడే ఆఖరి మంచుయుగం అంతరించి ప్రపంచమంతటా జలప్రళయాలు సంభవించి వాటి జ్ఞాపకాలు అనేక ప్రాక్కథల్లో, శ్రుతుల్లో మననం చేయబడ్డాయి. ధ్వనులు, సంజ్ఞలు, అర్థవంతమైన పదాలై, వాక్యాలై కీలలిపులు, చిత్రలిపులు, ఆ తరువాత భాషలు, సవాలక్షయాసలతో మాటలు, అక్షరమాలతో అక్షరాలు, కావ్యాలు మొదలై చరిత్ర రికార్డు కావడం మొదలైంది.
మనకు తెలిసిన మానవచరిత్రే పదకొండువేల సంవత్సరాలది. ఇ.యన్.ఫాలైజ్ 'మిరాకిల్' అనే గ్రంథంలో ఇలా వ్రాసాడు. ప్రపంచంలోని మానవ తొలి వలసలన్నీ ఎందుకో కార ణం చెప్పలేం కాని, అవి పామీరు పీఠభూమిలోని దక్షిణప్రాంతం వేపే సాగాయి (ఇండియా). ఈ వలసలు అలలు అలలుగా వచ్చి ఎక్కువమంది అక్కడే స్థిరపడిపోగా, మొదటచేరినవారిని ఆ తరువాత వచ్చినవారు నిర్మూలించడమో, వారిలో కలిసిపోవడమో చేయడం వలన ఇండియాలో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని జాతులు ఉన్నాయి. 1. నీగ్రెటోలు:- ఆఫ్రికా నుంచి వచ్చిన తొలివలస. నాగులు, ఏనాదులు, ఎరంబలు, ఇరులలు, కదిరులు, పాలయన్లు. 2. ప్రోటో ఆస్ట్రలాయిడ్లు:- సంతాలు, ముండా, అసుర, కొరవ, గదబలు-వీరే 'నిషాదులు'గా వ్యవహరించబడ్డారు. వ్యవసాయం ప్రారంభించింది వీరే. 3) ద్రవిడియన్లు:- మెడిటేరియన్ (మధ్యధరా) ప్రాతంనుంచి వచ్చినవారు. సుమేరియన్ జాతికి చెందినవారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాకుటుంబాలు ఈ జాతికి చెందినవి. వీరు మధ్యధరా ప్రాంతంనుంచి భారతదేశపు అంచులవరకూ వ్యాపించినారు. 4) ఇండో ఆర్యన్లు:- ఆర్యులుగా వ్యవహరించబడినవారు. నార్దిక్ జాతీయులు. శ్వేతవర్ణులు. క్రీ.పూ. 2500 నాటినుంచి భారతదేశంలో అలలు అలలుగా ప్రవేశించినారు. 5) మంగోలాయిడ్లు:- సిక్కిం,భూటాన్ ప్రాంత ప్రజలు. 6) పశ్చిమ బ్రాకిసెపాలిక్లు:- వీరి సంఖ్య తక్కువ. మానవుల అభివృద్ధిలో నిప్పు (80,000 సం) చక్రం (క్రీ.పూ. 3500) ముఖ్యపాత్ర వహించగా సుమారు అదే సమయంలో చిత్రలిపులు, కీలలిపులు-క్యూనిఫారం (సుమేరియన్లు) ఉన్నట్లు ఆధారాలు దొరికినాయి.
ఫోనిసియన్ల అక్షరమాల, ఈజిప్టు ఇతర ప్రాంతాల్లో క్యాలెండర్ నిర్మాణాలు మానవునిలో అభివృద్ధి అలలు అలలుగా అనేక చోట్ల ఒకేరకమైన ఆలోచనలుగా రావడం గమనించవచ్చును. క్రీస్తుపూర్వం 3300నుంచి 1890 వరకూ సుమేరియన్లు మధ్యధరా ప్రాంతాన్ని పరిపాలించారు. వారిని సైమైట్లు (అస్సిరియన్, అరామిక్, హిబ్రూ, ఫొనిషియా, అరబిక్, ఇథియోపిక్ భాష మాట్లాడే ప్రజలు) (షెమ్ వంశీయులు) ఓడించారు. సుమేరియన్లకు తెలీవాహక ప్రాంతపు ప్రజలకు ఉన్న సంబంధ బాంధవ్యాన్ని శ్రీ సంగనభట్ల నరసయ్యగారి (ఫిబ్రవరి 13వతేదీ నాటి 'వివిధ') వ్యాసంలో చూడవచ్చును. ప్రపంచ తొలి ఇతిహాసంగా పేర్కొనబడ్డ 'గిల్గామేష్ చరిత్ర'లోని జలప్రళయ ఘట్టం ఇంచుమించు భాగవతంలో వర్ణించబడ్డ ద్రవిడాధీశుడైన సత్యవ్రతుని కథలానే ఉండడం వీటి ప్రతిధ్వనులు అస్సురో బాబిలోనియన్ల కథల్లో, బైబిల్లోని 'నోవాస్ ఆర్క్'లో మనం గమనించగలం. తొమ్మిది వాకిళ్ళున్న వావిలోన్ (బాబిలోన్) పట్టణం, ఉర్, నిప్పుర్, మార్దుకు, నాబు, ఎంకి, ఎంకిడు లాంటి దేవతలు, ఇస్తారి, తుమ్మజు లాంటి గ్రామదేవతలు, ఊరికో అధిష్ఠానదేవత, వంశపారంపర్య పాలనాధికారాలు, అక్కడా ఇక్కడా దొరికిన కీలలిపిలో ఉన్న మట్టిబిళ్ళలు, ద్రావిడలిపికి సంబంధించిన హరప్పా, మొహెంజోదారోలలో ఇంకా అర్థం చేసుకోని మట్టిబిళ్ళలు, పురనిర్మాణాలు ద్రావిడుల, సుమేరియన్ల బృహత్ శిలానిర్మాణ సంస్కృతి, ఆర్యులను ధిక్కరించి జైన, బౌద్ధమతాలను అవలంబించి పాషాండులైన తీరూ మనకు ద్రావిడుల ప్రత్యేకతను తెలియజేస్తాయి. గోవా ప్రాంతంలో గిల్గామేష్ చిత్రాల్ని పోలిన శిల్పాలూ, సుమేరియన్ పదాల వాడుక (వ్యవసాయ భూములకు), కదంబుల రాజు గహల్లదేవుడు (క్రీ.శ. 960) తనకు వ్యాఘ్రమారుడుగా (గిల్గామేష్ సింహాన్ని చంపుతున్న చిత్రం లాంటిది) అభివర్ణించుకోవడం తెలుగువారి లావాదేవీలు సుమేరియన్ ప్రాంతంలోమట్టిబిళ్ళల రూపంలో లభ్యం కావడం ఆంధ్రుల ప్రాచీనతను తెలియజేస్తున్నాయి. ఆర్యుల రాకతో గుర్రాలు, విల్లంబులు, సంచారజీవనపు తెగువ, మొండితనం అప్పటికే పురాల్లో స్థిరనివాసులైన శాంతిప్రియులైన ప్రజల్ని ఓడించింది. మొదటితరం ఆర్యులు స్థానికులతో కలిసి పాలసముద్ర మథనం చేసి అమృతతుల్యమైన వస్తువుల్ని పొందగలిగారు.
పంపకాలలో తేడా దేవాసుర యుద్ధమైంది. ద్రావిడులు వామనావతారం నాటికి దక్షిణపథానికి నెట్టివేయబడ్డారు. అదే పాతాళలోకం. చీకటి, అంధకారలోకం. బలి బలిచేయబడ్డాడు. దితి గర్భం ముక్కలై మరుత్తుల జననం (అక్షరాల ప్రారంభం) జరిగింది. రామావతారం కాలంనాటికి తొలితరం ఆర్యులు రాక్షసులై స్థానిక నరమాంసభక్షకులతో కలిసి జనపదాలేర్పరుచుకున్నారు. ఇక్కడే మనకు మానవుల ప్రసక్తి, వీరికి సాయం చేస్తూ పరోక్షంగా కనపడే దేవతలు, రాముడు జన్మించి రాక్షస నిర్మూలనం చేసి అంధకారమయమైన దక్షిణాపథాన్ని కైవసం చేసుకోవాలన్న ఆర్య ఆలోచనలకు రామునిమార్గం రామయణ అవసరం ఏర్పడింది. భాషకూడా హనుమంతుని ఆలోచనల్లో (సుందరకాండ-త్రిజటాస్వప్నం తరువాతి ఘట్టం) రాక్షసుల సంస్కృతం, మానవ సంస్కృతంగా ఉన్నట్లు మనకవగతం అవుతుంది. బృహస్పతి శాపంతో గుడ్డివాడుగా పుట్టిన మమతా ఉధచ్యుల కుమారుడు దీర్ఘతముడి వలన బలిక్షేత్రమునందు పుట్టిన అంగ,వంగ, కళింగ, ఆంధ్ర, సింహ, పుండ్రక అనే ఆరుగురు పుత్రులు తూర్పుదేశాలకు పోయి వారిపేర్లతో ఆరు రాజ్యాలను స్థాపించుకున్నారు. వాటిలో ఆంధ్రరాజ్యం మాత్రమే అంధకరాజ్యంగా ఎందుకు కావాలి? దీర్ఘతముడి బిడ్డల్లో వీడొక్కడే గుడ్డివాడా? మిగతావాళ్ళు కాదా? శాతవాహన సామ్రాజ్యం, అశోకుని మరణానంతరం, చిముఖుడితో (శ్రీముఖుడు) ప్రారంభమై నాలుగు వందల యాభై ఏళ్లు (క్రీ.పూ. 235-క్రీ.శ. 218) సాగింది.
ముండా శబ్ద పదాలైన శాతకర్ణి, శాతవాహన పదాలు వీరిని 'గుర్రం' కుల దేవతగా ఉన్న కుదురును తెలుపుతాయి. కె. ఎ. నీలకంఠ శాస్త్రిగారు- ఆంధ్ర అనే శబ్దం 'జాతి' నామంగా, శాత వాహన శబ్దం రాజవంశంగా, 'శాతకర్ణి' అనే శబ్దం ఇంటి పేరుగా వివరించారు. శాతవాహనుల ప్రధాన భూభాగంగా గోదావరి కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ); పైఠాన్, ధరణి కోటల మధ్యనున్న ప్రదేశం కేంద్ర బిందువుగా వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. మొదటి, రెండవ శాతకర్ణులు, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, రెండవ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొత్తం 26 మంది రాజులు తమ సామ్రాజ్యాన్ని నలు దిక్కులా దక్షిణాన చెన్నపట్టణం వరకు విస్తరించారు. గ్రీకు, రోమనులతో వ్యాపారాలు, జైన బౌద్ధ మతాల అభివృద్ధి, సంస్కృతానికి ప్రాధాన్యత, ప్రాకృ త, పాళీ భాషలలో కూడా వ్రాయబడ్డ కావ్యాలు అనేక స్థానిక భాషలు, వాటిలోని 'దేశి' అనే స్థానిక భాష నేటి తెలుగు భాషకు సన్నిహితంగా ఉందని ఆచార్య సర్కార్ అభిప్రాయపడ్డారు. ఆనాటి లిపులలో ముఖ్యమైనవి బ్రాహ్మి, ఖరోష్టి, ద్రవిడ లిపులు. తమిళ సంగం కాలానికి ముందే విడివడిన తెలుగుభాష ఆర్యావర్తం నుంచి శపించబడో, వెళ్లగొట్టబడో వచ్చిన ఆర్యు లు తమ శ్వేతవర్ణంతోనో, బుద్ధిబలంతోనో స్థానికులను విస్మయపరచి ' ఇంకా' జాతి వారిని, 'అజ్టెక్'లను వశపరచుకున్న స్పానిష్ సైనికుల్లా తమ తమ రాజ్యాలను స్థాపించుకున్నారనిపిస్తుంది. మణి ప్రవాళానికి అంగీకరించక తమిళభాష తన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకోగలిగింది.
సర్దుబాటుతనంతో కన్నడ, తెలుగు భాషలు, కల్తీ చేయబడ్డాయి. అయినా ఇప్పటికీ అచ్చ తెలుగు పదాలు ఉర్దూ రాజభాషగా రాజ్యమేలినప్పటికీ తెలంగాణ పల్లెల్లో జీవించి అచ్చమైన తెనుగు తనానికి అద్దం పడ్తున్నాయి. (అయినా ఓ సందేహం! తెలుగు, ఆంధ్ర పదాలు సమానార్థకాలు ఎప్పుడు, ఎలా అయి నాయి?) ఈజిప్టు పిరమిడ్లలో (క్రీ.పూ. 2500) సుమేరియన్ శిథిలాల్లో, మట్టి బిళ్లలలో దొరికిన ఆధారాలు తెలుగు ప్రాచీ నతకు సరిపోదా? ద్రావిడ భాషలలో ఏదో ఒహదానికి ప్రాచీనతను అంటగట్టేప్పుడు అంతకంటే ప్రాచీనమైన ముండా లాంటి భాష లను పునరుద్ధరించాలి కదా? నాలుగు ద్రావిడ భాషలకు ప్రాచీనతా గుర్తింపునిచ్చి ఆర్థిక సహకారం చేస్తే ఈ అసంతృప్తి అణగిపోతుంది కాదా! లేదా ఆ వందకోట్లను నలుగురికి పంచేయవచ్చును -కాలరేఖను అటూ ఇటూ జరపకుండా! అంధకులు సర్దుకుపోతార్లే అన్న గుడ్డి ధైర్యమే ఈ తాత్సారానికి కారణమా? ఈ దుష్ట స్వప్నం ఎప్పుడు సమసి పోతుంది? చరక సంహితలో ఇలా చెప్పబడింది. 'గృధ్రో లూకశ్వ కాకా ద్వైః స్వప్నే యం పరివార్యతే రక్షః ప్రేత పిశాచ స్త్రీ చండాల ద్రవిడ ఆంధ్రకైః' కలలో ఆంధ్రులు కనిపిస్తే అరిష్టం. కాబట్టి వందకోట్లివ్వాల్సిన ఆర్యుల కలల్లో కనిపించి వాళ్లని వణికింపజేసే పోరాటం చేస్తేగాని మన ప్రాచీనతకు వాళ్ళు వ్రాసిన శ్లోకాలకు ప్రామాణ్యం రాదు. పదండి! పోరాడితే పోయేదేముంది గనుక! పదండి ముందుకు!