తెలుగువారికొక భాషావిధానం అవసరం Telugu/Home


(డా. ఆర్వీయస్‌. సుందరం, మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు)

తెలుగు మాట్లాడేవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాక భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, విదే శాలలో కూడా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకా రం కనిపించే తెలుగువారి సంఖ్యకు అసలైన సంఖ్య కనీసం రెండింతలు ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాలలో ఉన్న తెలుగువాళ్లు ఇంట్లో తెలుగు మాట్లాడినా జనాభా లెక్కల కోసం ఎప్పుడూ తమ భాష తెలుగని చెప్పరు. ప్రవాసాంధ్రులు మాత్రం అలా చెప్పుకుంటారు కాని పరప్రాం తాలలోనే పుట్టి పెరిగిన వారెవరూ తమ మాతృభాష తెలుగని ఒప్పుకోరు. అందువల్ల లెక్కల్లోతేలేది ప్రవాసాంధ్రులే కాని రాష్ట్రేత రాంధ్రులు కారు. ఇదెలా వున్నా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనాభా అంచనాలను బట్టి సుమారు ఎనిమిది కోట్ల మంది తెలుగువారున్నారు. ఇతర ప్రాంతాలలో మరో ఏడుకోట్ల మంది ఉంటా రు. ఇంతమంది తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఈ భాషకంటూ ఒక విధానం అవసరం ఉంది. ఇది ఎంతగా చెప్పినా మన పాలకుల తలకెక్కకపోవడం తెలుగువారి దురదృష్టం. ఈ తెలుగు వాళ్లలో ఏ ఒక్క శాతమో ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఉద్యోగం కోసమో ఇతర కారణాలవల్లనో వెళ్లవచ్చు. మన పాలకులకు, రాజకీయవేత్తలకు ఉన్న గొప్ప భ్రమ ఏమిటంటే ఆంధ్రులలో కనీసం సగం మంది ఏ విదేశాలకో వెళ్లిపోవలసినవారే. లేకుంటే తెలుగుపట్ల ఇంత ఉదా సీన భావం ఎందుకుంటుంది? తెలుగువాళ్ల కోసం తెలుగువాళ్ల ఓట్లతో ఏర్పడిన ప్రభు త్వం, తెలుగువాళ్లని పరిపాలిస్తూ, తెలుగుద్వారానే న్యాయం, పరిపాలన, విద్యాబో ధన, మరేవైనా జరగాలనే ప్రాథమిక కర్తవ్యాన్నయినా గుర్తు చేసుకోకపోవడం ఆశ్య ర్యాన్ని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అధ్యాపకులు, ఆచార్యులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ఇంగితజ్ఞానం ఉన్న పరిపాలకులు, అధికారులు దీన్ని గురించి గంభీ రంగా ఆలోచించాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.

తెలుగు భాషకు మూడువేల ఏళ్ల చరిత్ర ఉంది. తెలుగు పదాలు శాసనాల్లో రెండువేల ఏళ్ల నుంచి కనిపిస్తున్నాయి. తెలుగులోనే శాసనాలు 1500 సంవత్స రాల నుంచి ఉన్నాయి. తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉంది. తెలుగు భాష మడికట్టుకోకుండా వేలకొద్దీ పదా లని సంస్క­ృతం నుంచి, ఇంగ్లీషు నుంచి, ఇతర భాషల నుంచి స్వీకరించి బలపడింది. అందువల్ల ఎలాంటి విషయాన్న యినా సమర్థవంతంగా అభివ్యక్తి చేయగల సత్తా తెలుగు భాషకు ఉంది. మరి ఇలాంటి భాషని పదిహేను కోట్లమంది తెలుగువాళ్ల అవసరాలకి తగినట్లుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన మీద లేదా?

తెలుగు వారికొక భాషావిధానం అవసరమన్నప్పుడు దాని కోసం ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుతం తెలుగు అధికార భాష కదా, దానికోసం అధికార భాషా సంఘాన్ని కూడా నియమించాం కదా, తెలుగు వాళ్ల కోసం కొన్ని బహుమతులిస్తున్నాం కదా, తెలుగు విశ్వ విద్యాలయాన్ని స్థాపించాం కదా అని సమాధానాలు చెప్పవచ్చు. కాని నిజానికి ఇవి చాలవు. భారతదేశంలో హిందీని అధికార భాషగా ఎలా అమలు చేస్తున్నారో, హిందీ అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అలాంటి చర్యలకంటే ఎక్కువగా తెలుగుపట్ల తీసుకోవలసి ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఒక్క హిందీని మాత్రమే మాట్లాడటం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష. వీళ్లకి హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్‌ తెలియదు. అందువల్ల జాతీయ స్థాయిలో ఏదో ఒక అనుసంధాన భాష కోసం తాపత్రయపడాలి. కాని ఆంధ్రరాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడివాళ్ళు మాట్లాడేది తెలుగే. ఇతర భాషలవారి శాతం చాలా తక్కువ. ఇన్ని కోట్లమంది మాట్లాడే తెలుగుని నిజంగా మనం అభివృద్ధి పరచగలిగితే అది అంతర్జాతీయ స్థాయిలో కూడా గౌరవ మర్యాదల్ని పొందుతుంది. అప్పుడు తెలుగు మాధ్యమంలోనే అన్ని విషయాలనూ నేర్చుకోవటానికి విదేశాల నుంచి కూడా విద్యార్థులు తరలివస్తారు. తెలుగువాళ్లు తమ జ్ఞానాన్ని తెలుగులోనే వ్యక్తీకరించే శక్తిని సంపాదించుకుంటారు.

తెలుగు మాతృభాషగా కలవారికి తెలుగులోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలి. తెలుగుతో బాటు ఇంగ్లీషును కూడా ఒక భాషగా చక్కగా బోధించాలి. ఈ ఒక్క విషయంలో పరిపాలకులు విజ్ఞత చూపించాలి. భాషను నేర్చుకోవటం వేరు, భాష ద్వారా నేర్చుకోవటం వేరు. ప్రాథమిక విద్యను తల్లిభాష ద్వారా నేర్చుకుంటేనే బాగా బోధపడుతుంది. ఉన్నత విద్యని ఇంగ్లీషులో నేర్చుకున్నా దాన్ని తెలుగులో చెప్పగలిగే శక్తిని తెలుగువారికి కల్గించాలి. ఇదే ప్రపంచమంతా అనుసరిస్తున్న మార్గం.

చాలామంది వాదన ఇలా వుంటుంది. ఇంగ్లీషు నేర్చుకోబట్టే రాధాకృష్ణన్‌ గొప్పవారయ్యారు. రవీంద్రుడు నోబెల్‌ బహుమతి సాధించాడు. జిడ్డు కృష్ణమూర్తి తత్త్వవేత్త అయ్యాడు - అని. ఇది మూర్ఖపు వాదన. అలా అయివుంటే ఇప్పటికే ఇంగ్లీషు నేర్చుకున్న వేలకొద్దీ మేధావులు ప్రపం చ ప్రసిద్ధి పొందాల్సింది. అయితే ప్రపంచంలో ఎంతోమంది మేధావులు ఇంగ్లీషు నేర్చుకో కుండానే నోబెల్‌ బహుమతులు పొందారు. విజ్ఞానులయ్యారు. రచయితలయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పాఠశాలలో, కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో తెలుగే మొద టి స్థానంలో ఉండి, ఇంగ్లీషు కేవలం తరగతిగా ఉండాల్సింది పోయి, తెలుగుకు స్థానమే లేకుండా ఉండడం అందరికీ అవమానకరం. దీనికి తగిన పరిస్థితుల్ని కల్పించకపోవటం ప్రభుత్వం చేస్తున్న నేరం. పోలీసు వ్యవస్థ, వైద్యరంగం, న్యాయవ్యవస్థ, శాసనసభా కార్యకలాపాలు, సభలు, సమావేశాలు, ప్రజాసంబంధ వ్యవ హారాలు, సాంకేతిక విషయాలు అందరు తెలుగువాళ్లకు అర్థమయ్యే భాషలో ఉండాల్సిన అవసరముందని మన ప్రభుత్వం ఎందుకు భావించదో తెలియదు. దీనికి మనం తీసుకోవలసిన చర్యలెన్నో ఉన్నాయి.

1. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయమూ తెలుగు ద్వారా తెలుగు ప్రజలకు తెలిసే విధంగా చర్య లు చేపట్టాలి. దీనికోసం పెద్దఎత్తున అనువాదం జర గాలి. ప్రజలకు అవన్నీ చేరాలి. చరిత్ర, రాజనీతి, పరిపా లన, సాంకేతిక విద్య, వైద్యం, న్యాయం, వ్యాపార రం గం, సాహిత్యం, సంస్క­ృతి మొదలైన అన్ని విషయాల నూ తెలుగువారికి అందించే సంస్థ కావాలి. అలాగే తెలుగువారి ప్రతిభను, సామర్ధ్యాన్ని బయటి లోకానికి తెలిపే కార్యక్రమా లనూ చేపట్టాలి.

2. ఆంధ్రప్రదేశ్‌లో అన్నిరంగాలలో తెలుగే మొదటి స్థానాన్ని ఆక్రమించాలి. విద్య, న్యాయం, పరిపాలన, క్రీడలు, సంస్క­ృతి ఇవన్నీ ఇందులో భాగాలే. ఇంగ్లీషును అనుసంధాన భాషగా బలపరచాలి. 3. అన్ని సంస్థలలో, అంగళ్లలో, కార్యాలయాలలో ఫలకాల మీద తెలుగే మొదటి స్థానంలో, ప్రధానంగా ఉండాలి. 4. జాతీయ స్థాయిలో తెలుగుకు గౌరవం దక్కేలా చేయాలి. 5. తెలుగువారి కార్యక్రమాలన్నీ తెలుగులోనే జరగాలి.

ఇప్పటికైనా తెలుగు వాళ్లందరం తెలుగును గురించి ఆలోచిద్దాం.

(భాషా విధానంపై నేడు సలహా సంఘం సమావేశం సందర్భంగా)