(కత్తి పద్మారావు)
తెలుగు భాష సమాజ పునాదుల నుండి ఎలా ఆవిర్భవించిందో పరిశోదన జరుగుతున్న కాలం. మానవ ఆవిర్భావానికి పరిణామానికి ఎంత చారిత్రక ప్రాధాన్యత వుందో భాషా పరిణామానికి కూడా అంతే ప్రాధాన్యత వుంది. ఒకనాడు మనం చరిత్రను ముందుకు తీసుకెళ్ళడం కోసం పురావస్తు తవ్వకాల వల్ల బయటపడిన మహంజదారో సంస్కృతిని ఉపయుక్తం చేసుకున్నాం. ఈనాడు మానవ సమాజ పునరేకీకరణకు సామాజీకరణకు వున్న సంబంధాన్ని లోతుల్లోకి వెళ్ళి భాష ఆవిర్భావం ద్వారా మనం తెలుసుకుంటున్నాం.
తెలుగు భాషలో అట్టడుగు సమాజంగా భావిస్తున్న దళిత సమాజం నుండి ముందు తరంలో దూసుకొచ్చిన కవుల్లో కుసుమ ధర్మన్న, గుఱ్ఱ ం జాషువా, బోయి భీమన్న ప్రసిద్ధులు. బోయి భీమన్నను ఇప్పుడు పరికించి చూద్దాం.
గోదావరి భాష
గోదావరి జిల్లాలు నీటి ప్రవాహాలకు ఎలా నెలవులో మాటల ధాన్యరాసులకు కూడా అలాగే స్థావరాలు, సహజంగా ఆ జిల్లాల్లో ఎవరిని కదలించినా మాటలు జలజల రాల్తాయి. చక్కని ఊనికలు, చిక్కని పదబంధాలు, సామెతలు, నానుడులు, ఎటకారాలు, వ్యంగ్యాలు గోదావరి భాషకు వన్నెలు. గోదావరి జిల్లాల్లో ప్రతి మనిషి భాషలో కవిత్వం దాగి వుంటుంది. నీళ్ళు ముందు రావడం వల్ల చెట్లు, చేమలు, కాలవలు, చెరువులు, జలచరాలు, పంటలు, పైరులు, ప్రకృతి సౌందర్యం ఆక్కడ భాషకి జవజీవాలు పూన్చాయి.
అంబేడ్కర్ ప్రభావంతో భీమన్న కవి
సామాజిక వ్యవస్థకు వస్తే సమాజంలో వుండే అంతరాలన్నీ అక్కడ బలంగా వున్నాయి. అట్టడుగు వర్గాలు చాలాకాలం పాలేరులుగా, జీతగాళ్ళుగా అక్కడా జీవించారు. అయితే ఆంధ్రరాష్ట్రం మొత్తంలో ముందు మేల్కొన్న జిల్లాలు అవి. దీనికి కారణం డా. బి.ఆర్.అంబేడ్కర్ సిద్ధాంతాలు మొట్టమొదట ప్రవాహంగా వచ్చింది గోదావరి జిల్లాల్లోనే. తూర్పు గోదావరి జిల్లాలో అంబేడ్కర్ స్వయంగా పర్యటించడం వల్ల, అక్కడ ఆయనకు ఎందరో శిష్యగణం వుండటం వల్ల అక్కడ ఆ భావాలు బాగా ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా బోయిభీమన్న అటు అంబేడ్కర్ వాదిగా, ఇటు ప్రకృతి రమణీయతను భాషా సామర్థ్యాన్ని ఒడిసి పట్టుకున్న కవిగా ఒక విద్యుద్దీపంగా వెలుగొందాడు.
భీమన్న పైరు కవిత
భీమన్న కవిత్వంలో తెలుగు భాష పైరు పంటగా పండింది. అమ్మ నాగమ్మకు భక్త్యంజలి ఘటిస్తూ పైరు పాట గేయ నాటకంలో ఇలా అంటాడు.
పైరు చేల గట్టులలో
పచ్చగడ్డి పువ్వులలో
పల్లెటూరి పడుచులతో
పాటలెన్నొ పాడుకొంటు
చల్లని నా భావలతను పల్లవింపజేసిన
ఊడ్పుచేల మునుములలో
ఉయ్యేలా పాటలతో
పరికన్నెల చిరుగుండెల
వరహాలను పండిస్తూ
నా శైశవ హృదయంలో
నందానాలు నాటిన
కొబ్బరి మామిడి తోటల
కోయిల తీయని పాటల
శ్రమ నెంచక పాటుపడుచు
సంసారం దిద్దుకొనుచు
పెంకెతనపు నా గుండెను
ప్రేమార్ద్ర మొనర్చిన (పాలేరు నుంచి పద్మశ్రీ వరకు భోయి భీమన్న, హైమవతి - పేజి 10)
ఈ గేయ కవితలోని ప్రతి తెలుగు మాట ఒక సంస్కృతికి ఒక జీవన విధానానికి అద్దం పడుతున్నాయి. ఇందులో పైరు చేలు, గట్టులు, పల్లెటూరి పడుచులు, ఊడ్పుచేలు, మునుములు, ఉయ్యాల పాటలు, వరికన్నెలు, కొబ్బరి మామిడి తోటలు, కోయి పాటలు ఇవన్నీ గోదావరి గట్లు మీద నడిచినట్లే మనకి తలపింప చేస్తున్నాయి. భీమన్న తన రచనలో తన సామాజిక నేపథ్యాన్ని బలంగా చెప్పాడు.
ప్రకృతికి పరవశించిన కవి పట్ల సమాజం ఆగ్రహించిన రవి
గోదావరి ప్రకృతిలో ఆయన ఎంత పరవశించాడో, సామాజిక రుగ్మతుల పట్ల కూడా ఆయన అంత వ్యధ చెందాడు. భీమన్న కవితలో పూల పరిమళంతో పాటు అగ్ని సెగ కూడా దాగి వుంది.
రగులుచున్నది అగ్ని పర్వత మొ కొక్క
శ్రామికుని గుండెలో, అది రగిలి రగిలి
భళ్ళుమని బ్రద్దలై అగ్ని బరవు నేని
అపుడు చింతించి లాభమేమైన కలదె? (కూలిరాజు (నాటకం) -211)
భీమన్న సమాజాన్ని రెండు పార్శ్వాల నుండి చూశాడు. ప్రకృతిలో రమణీయతను చూశాడు. మనిషి గుండెల్లో అగ్నిని చూశాడు. ప్రకృతి లాగే సమాజం సమతుల్యం కావాలంటే ప్రకృతిని సమాజాన్ని, సమన్వయించాలన్నాడు. సమత కోసం వెలుగెత్తాలనుకున్నాడు. అంత మాత్రాన మనిషి నిర్వీర్యం చెందకుండా ప్రకృతిలోని వెలుగుల్ని సంతరించుకోవాలని కూడా ప్రబోధించాడు. అదే భీమన్నలోని కవితా ఋషితత్వం.
నన్ను కన్నె కోకిలను గానమ్ము నేర్చు
కొందువా అని పిల్వ నానంద మొంది,
సోగ కన్నుల నెమ్మి నా జోడు గూడి
ఆడుకొందువు వత్తునా అనగ మురిసి,
ముగ్ధ మందార సుమము నామోవి తేనె
ఊర్వశికి తుల్యమని చెప్ప ఊరి ఊరి,
తొట్ట తొలిగా నా ఊయెల తొట్టి నుండి
దూకి పర్విడినాడ నీ లోకమునకు
గడప దాటించిన నను తోట గట్టు చేర్చి
తోట తోటనె చంక కెత్తుకొనినావు
గట్టు దాటించి నీయాట పట్టు చేర్చి
ఇక ననున్ బట్టి ఎదకు హత్తుకొన రావె (భీమన్న కావ్య కుసుమాలు - 19)
ఈ కవితలో తెలుగు భాషా సౌకమార్యాన్ని భీమన్న ప్రదర్శించాడు. బహుముఖమైన విశ్వసౌందర్యమంతా తన చుట్టూ చేరి సంగీత రుతులుతో నాట్యమాడుతుందని చెప్తున్న భీమన్న తెలుగు సంస్కృతిలో వున్న ప్రకృతి రమణీయకతను తన కవిత్వంలో చిన్నతనం నుంచే పొదుగుతూ వచ్చాడు.
ఆయన రచనలోని పదాలన్నిటిని నిఘంటువుగా కూర్చితే కొన్ని వేల పదాలు గోదావరి సంస్కృతికి అద్దంపడతాయి. ప్రాచీన కవుల్లో శ్రీనాధుడు, శ్రీకృష్ణదేవరాయలతో బోయిభీమన్నను పోల్చవచ్చు. ఆయన కవితా సామర్థ్యం అసమానమైంది. ఒక భావాన్ని వ్యక్తీకరించడంలో భీమన్నకు వున్న తీవ్రత కృష్ణదేవరాయన మాలదాసరి కథను తలపిస్తుంది. పదాలు కూర్చడంలోగాని వాటిని ఈటెలుగా విసరడంలో గాని భీమన్నకు భీమన్నే సాటి. తాను ఏ పునాదుల నుండి వచ్చడో ఆ పునాదుల నుండే తాను కవిత్వం చెప్తాడు. అది గద్యమైనా, పద్యమైనా, నాటకమైనా ఆ పట్టు, ఆ వరవడి సజీవంగా వుంటుంది. తన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తూ భీమన్న
నీరుకట్టి, మళ్ళుకట్టి, నారుకట్టి
కంచెలును కట్టి నన్ను పోషించ రెవరు,
అడవి మొక్కను నేను, స్వేచ్ఛావకాశ
వీధుల దిష్టమై నట్టు విరియుచుంటి ( (భీమన్న కావ్య కుసుమాలు - 43)
భీమన్న కవిత్వం రాసే నాటికి గోదావరి జిల్లాల్లో భూస్వామ్య కులతత్వాలు బలంగా వున్నాయి. అస్పృశ్యత ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో బలమైన ప్రభావాన్ని చూపుతున్న కాలంయ బ్రాహ్మణులు కవిత్వం మీద తమ ఆధిపత్యాన్ని ప్రకటిస్తున్న కాలం. పద్య కవిత్వంలోనే వాళ్ళను సవాల్ చేసి భాష ఒకరి సొత్తు కాదు కవితా కన్య ఒకరి ప్రియురాలు కాదు అని చెప్పిన ధీరుడాయన.
కవిత ఒక ప్రక్రియకు ప్రేయసి కాదు
ఒక భాషకు బందీ కాదు
ఒక స్వేచ్ఛా సుందర మధుర భావన అది
కవిత ్‌వ్రాసేది, చదివేది కాదు
ఆస్వాదించి ఆనందించేది. గుడిసెలు (318)
బోయి భీమన్న గారు గుండె వున్న కవి. ఆయన ధర్మం కోసం పోరాడటం కాని, గుడిసెలు కాని, దీప సభ కాని, త్రిపదలు కాని ఎవరికీ తీసిపోని వస్తు సామర్థ్యం కలిగినవి. ఏ సభలో కూడా ఎందరు పండితులు వున్నా, ఎందరు కవులు వున్నా తన ముద్రను ప్రకటించుకోగలిగిన కవి. ఆయన వ్యంగ్యం, ఆయన వక్రోక్తి దళితుల జీవన సంస్కృతుల్లో నుండి వచ్చినవి.
ఆవేదనా భాష
భీమన్న తెలుగు సాహిత్యాన్ని ఆపోషణ పట్టిన కవి. అవసరమైన చోట సంస్కృత పదజాలాన్ని కూడా కుమ్మరించాడు. ఆవేదన కలిగిన కవి, ఆత్మఘోష కలిగిన కవి. నిబద్ధత కలిగిన కవి. భాష మీద పట్టే కాకుండా భాషను తేనె తుట్టలా పిండిన కవి. ఒక చీమను తీసుకొని గుడిసెల్లో ఎంత ప్రయోగం చేశాడో చూడండి.
నల్ల చీమలు, తెల్ల చీమలు, ఎర్ర చీమలు
చలి చీమలు, పులి చీమలు, కండ చీమలు
అబ్బో ఎన్నెన్ని రకాల రంగుల చీమలు
ఒకో రంగు చీమలకు ఒకో పుట్ట
ఏ రకం చీమలకైనా వుండే దొకే పొట్ట
ఏ పొట్ట నిండడానికైనా
కావలింది ఇన్ని గింజలు
గింజల కోసం గింజుకు చస్తున్నై...
తెలివి తక్కువ చీమలు
గింజల కోసం గింజుకు చస్తుంటే
అవి పెట్టిన పుట్టలు
పాముల కిరవవు తుంటై (గుడిసెలు - 389)
ఈ కవితలో వున్న ప్రతి పదం తెలుగు వాడికి అర్ధమౌతుంది. దాని అంతర్యం అర్ధమౌతుంది. నిజానికి దళితుల జీవితంలోనే ఒక కవితాభివ్యక్తి మనకు కనిపిస్తుంది. వారు కష్టాల్లో వుంటారు. ప్రకృతికి దగ్గరగా వుంటారు. తాను ఎదురుగా వున్న మనిషికి తన మాట అర్ధమౌతుంది. అందుకు వారి మాటల్లో, వారి పాటల్లో ఒక లయ, శృతితో కూడిన కవిత్వం వుంటుంది. దళిత వాడలో ఒక తల్లి చనిపోతే వందల మంది ఏడుస్తారు. ఒక పెండ్లి జరిగితే
గుంపులు గుంపులుగా పాటలు పాడుతారు. ఇది బ్రాహ్మణ వీధుల్లో చూడలేం. మా గురువు గారు నిష్టల సన్యాసిశర్మగారు చనిపోయినప్పుడు నాలుగో మనిషి మోసేవాడు లేక ఆయన్ని ఆపారు. అప్పుడు మాకు వాళ్ళ దయనీయ పరిస్థితి మీద చాలా దిగులు వేసింది. కర్మకాండ ఎక్కువగా వుంది. మానవతా స్పృహ తక్కువగా వుంది. దళిత పల్లెలు ఈనాటికి నిలబడ్డాయంటే వాటిలో అంతర్గతంగా దాగివున్న సామాజిక స్పృహ, ప్రేమ, ఆత్మీయత దళిత కవుల్లో వచ్చినంత ఇతరుల్లో రాకపోవడానికి కారణమదే.
ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది చాలా వుంది
బ్రాహ్మణులు దళితుల నుంచి ప్రేమను నేర్చుకోవాలి. బ్రాహ్మణుల నుంచి దళితులు నిరంతర అభ్యసనాన్ని నేర్చుకోవాలి. బ్రాహ్మణులు రాసినవి అందరూ చదువుతారు. దళితులు రాసినవి తొందరగా అందరూ చదవరు. అందుకే మానవ జాతికి సంబంధించిన అనేక అమూల్యమైన విషయాల్ని వీళ్ళని చదవనివారు కోల్పోతున్నారు. సజీవమైన సమాజంలో సజీవమైన భాష పుడుతుంది. అప్రాచ్యుడా, అవాచ్యుడా వంటి సంస్కృత నిందా పదాలు బ్రాహ్మణులు మాట్లాడితే అరే ఒరే అని, అసే ఒసే అని కమ్మ, రెడ్డి, వెలమ, రాజు కులాలు మాట్లాడాయి. అందుకే వారి భాషలో నిందా వాక్యాలే ఎక్కువ. కాని దళితుల భాషలో ప్రేమ నిధి వుంది. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక పెద్దమ్మ, ఒక చిన్నమ్మ ఇంతమంది సాస్కృతిక నేపథ్యం ఒకరు పెరగడానికి వుంటుంది. బ్రాహ్మణ జీవితంలో కర్మకాండ ఎక్కువ. అది జీవితానికి పనికిరాదు. శూద్రులు ఈ కర్మకాండనే నేర్చుకుంటున్నారు కాని దళితుల జీవితంలో వున్న సామాజికతను అందుకోలేక పోతున్నారు. కారణం మీరు మా కంటే క్రిందవారనే తక్కువ భావం.
తెల్లజాతులపై నల్ల జాతుల పోరాట జెండా
నల్లజాతుల కవిత్వం, చరిత్ర వచ్చాక తెల్లజాతుల కంటే వారు అనేక విషయాల్లో గొప్పవారని అర్థమైంది. ఇప్పుడు సంగీతంలో సాహిత్యంలో తెల్లవాళ్ళ కంటే నల్లవాళ్లే ముందున్నారు. ఇప్పుడు నాటకాల్లో, సినిమాల్లో, పారిశ్రామిక వ్యవస్థల్లో చివరకు అందాల పోటీల్లో కూడా తెల్లవాళ్ళపై నల్లవాళ్ళు విజయ పతకాలు ఎగురవేస్తున్నారు. వీడు ఫలానా కులంలో పుట్టాడు కాబట్టి సాహిత్యం చదవకూడదు. వాడి భాష నేర్చుకోకూడదనే న్యూనతా భావం ఇక్కడ అగ్రకులాన్ని సంకుచిత పరిధిల్లోకి నెట్టుతుంది. ఏ సమాజం అతి ప్రాచీనమైందో ఆ సమాజంలోనే విలువైన అంశాలు ఉంటాయి. అందుకే దళిత కవిలో సాంస్కృతిక సామాజిక మూలాలు లోతుగా వుంటాయి. ఆత్మ విశ్వాసం బలంగా వుంటుంది. భీమన్న రెండు ప్రకటనలు చూడండి.
దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్టు
నాయకులు ప్రజాధనం పంచుకోవచ్చు,
అంత మాత్రం చేత ఏమవుతుందిలే
గొర్రె చస్తుంది కాని, గరికె చస్తుందా? (టుమ్రీలు - 481)
పల్లె పొలమును పాత గుడిసెను
ప్రమిదల్లో చిరువత్తి నేనే,
నగరమున మణిదీప మేనే
జగతి కంతకు రవిని నేను
రశ్మి ఒక్కటైయన, ఆధా
రమును బట్టి ప్రకాశ ముండును
విశ్వ పరిణామమున జరిగే
విప్లవమ్ముల నేది ముందుకు
పోవునో, అదె నాకు నిలయము? (మానవుని మరొక మజిలీ - 355)
భీమన్న గారి కవిత్వం చదువుతుంటే ప్రజాకవి వేమన గుర్తుక్‌ొస్తాడు. అలతి అలతి పదాల్లో అనంత అర్ధాలు వుంటాయి. తూర్పు గోదావరి జిల్లాల్లో సామాజిక పోరాటం ఎంత బలంగా జరిగిందో భూ పోరాటం కూడా అంతే బలంగా జరిగింది. కందికట్ల నాగభూషణం వంటి సామాజిక వీరులు అక్కడ పోరాటం చేశారు. అందుకే అక్కడ దళితుల మాటల్లో పూతరేకులు వుంటాయి, ఈటెలు శూలాలు వుంటాయి. తన సంస్కృతీ మూలాల నుంచే కాకుండా తాను ఏ సమాజం చేత అణగద్రొక్కబడుతున్నాడో ఆ సమాజ గర్భంలో దాగివున్న అనేక చిక్కుముడులు, దళిత కవిని వేధిస్తాయి. ఉన్నది నిలుపుకుంటూ లేనిది గెలుచుకోవాలి మనిషి - అని భీమన్న గారు ప్రకటిస్తారు. భీమన్న గారిది అనంత స్నేహం. కుల మతం భేధం లేకుండా సామర్థ్యంతో కూడిన సాహచర్యం వుంది.
భీమన్న ‘పాలేరు’ ఒక సామాజిక శాస్త్రం
అటు పద్య సాహిత్యంలోనే గాక నాటక సాహిత్యంలో పాలేరుని సృష్టించి సామాజిక పునాదుల్ని కుదిపి వేశాడు భీమన్న. ఒక పాలేరు భూస్వాములు పెడుతున్న ఇక్కట్ల నుండి తప్పుకొని, ఎదిరించి ఒక వ్‌ిద్యావేత్తగా అధికారిగా ఆవిర్భవించి, ఆసామికే శిక్ష వేయగలిగిన స్థాయికి వచ్చిన కథ ఆ నాటకం. ఎందరో పాలేరు జీవితాలకు విముక్తి కలిగించారు ఆయన. ఆ నాటకాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో ఆడని ఊరు లేదు. ఈ నాటకం మీద ప్రత్యేక కృషి
చేసిన సవేర గారు ఇలా ప్రశంసిస్తున్నారు.
భారత భాస్కరుడైన, దళిత జనవైతాళికుడైన డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో, అనితర సాధ్యమైన రచనా శక్తితో, అక్షరమే ఆయుధంగా, రంగస్థలమే ధర్మయుద్ధక్షేత్రంగా, ‘పాలేరు’ దాస్య విముక్తికి తెరతీసి, వేలాది దళిత పాలేర్లను గడ్డి బీళ్ళ నుండి పాఠశాలలకు పరుగులు తీయించి వారు ఆఫీసర్లయ్యేందుకు ప్రధానకారకుడైన నాటకకర్త డాక్టర్ బోయి భీమన్న గారు. ఈ నాటక ప్రదర్శన కోసం రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలలో గ్రామ గ్రామాన నాటక సమాజాలేర్పడ్డాయి. ఇవి పోటీపడి ప్రతి దళిత పేటలో ప్రదర్శనలిచ్చాయి. సుమారు రెండు దశాబ్దాల పాటు (1940-60) నిరాంటకంగా ఆడబడ్డ ఈ నాటకాన్ని చూడని దళితులు లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగులో వెలుగులోకి వచ్చిన సాంఘిక నాటకాలలో అపుర్వమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించిన నాటకం ‘పాలేరు’ మాత్రమే అనేది నిర్వివాదాంశం. ఈ నాటకం నాటక సాహిత్య మకుటమగుటయే కాదు భీమన్న కీర్తికిరీటంలో కలికితురాయిగా భాసిల్లుతోంది. కన్యాశుల్కం, వరవిక్రయం, చింతామణి రంగూన్‌ౌండి, రక్తకన్నీరు, పల్లెపడుచు, మా భూమి, ఇత్యాది నాటకాలు సామాజిక విప్లవ సాధనలో ‘పాలేరు’ తర్వాతే పేర్కొనదగినవి. కాని నాటక విమర్శకాగ్రేసరులు కొందరు ఈ నగ్నసత్యాన్ని గుర్తించకపోవడం విచారకరం.
సామాన్య ప్రజాజీవనానికి ప్రతిబంధకాలైన కుల-మత-వర్గ-లింగ వివక్షతలు, అణచివేతలు, దోపిడీ దౌర్జన్యాలు, నిరంకుశత్వం, అరాచకత్వం మొదలగు సమకాలీన సామాజిక రుగ్మతుల్ని ఇతివృత్తాలుగా స్వీకరించి, సందేశాత్మక నాటకాల్ని రచించిన విశ్వవిఖ్యాత నాటకకర్త షేక్స్పియర్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతయైన గిరీష్ కర్నాడ్, అంతర్జాతీయ అవార్డు నందుకున్న మంజులా పద్మనాభన్ వంటి ప్రఖ్యాత నాటకకర్తల శ్రేణికి చెందిన వాడు పద్మభూషణ భీమన్న గారు.
(దళిత చైతన్య లహరి - 2, 3)
కన్యాశుల్కం కంటే ఉత్తమమైన నాటకం ‘పాలేరు’
ఆనాడు ఆంధ్రప్రదేశంలో పౌరాణిక నాటకాల జోరు విపరీతంగా సాగుతోంది. ఒక ప్రక్క కురుక్షేత్రం, సత్యహరిశ్చంద్ర, చింతామణి, శ్రీకృష్ణ రాయభారం, గయోపాఖ్యానం వంటి నాటకాలు సంగీత అభినయ పూర్ణంగా శ్రోతలను ఆకట్టుకుంటున్న రోజులు. ఒకప్రక్క పరిషత్ నాటకాలు మొత్తం మీద ఆంధ్రదేశంలో నాటకరంగం సుసంపన్నంగా వర్థిల్లిన కాలం. అనేక నాటకాల్లో దళితుల్ని అవమానించే ఘట్టాలు కూడా వున్నాయి. ముఖ్యంగా సత్యహరిశ్చంద్రలో మాతంగి కన్యను గూర్చి ప్రస్తావిస్తూ ఈ మాల కన్యల్ని వివాహమాడే బదులు వర్ణసంకరం చేలే బదులు రాజ్యమైనా వదిలి పెడతామని హరిశ్చంద్రుడు అనడం ఆ పాత్రని దళిత నటులే నిర్వహించి తమను తాము అవమానించుకోవడం ఇప్పటికీ జరుగుతున్నది. అయితే పాలేరు నాటకం వీటన్నిటికి భిన్నంగా కులతత్వాన్ని, బానిసత్వాన్ని రెండింటని నిర్మూలించి ముందుకు వెళ్ళి తమకు తాము ఆత్మస్థైర్యాన్ని కలిగించుకునే సామర్థ్యం తెచ్చింది. అంతేకాక పేదరికాన్ని, కులతత్వాన్ని ఎదుర్కొనడానికి అక్షరాన్ని ఆయుధం చేసింది. మానవ హక్కుల పోరాటానికి పాలేరు నాటకం విజయపతాకం ఎగురవేసింది. పాలేరులో పాత్రల నిర్మాణం, మనస్తత్వ విశ్లేషణ, కులనిర్మూలనా భావం, సామాజిక విప్లవ దృష్టి చూసినట్లైతే కన్యాశుల్కం కంటే ఉన్నతమైన నాటకంగా మనం చెప్పుకోవచ్చు. కాని కన్యాశుల్కానికి ఇ్‌చ్చిన ప్రచారాన్ని వామపక్షవాదులు పాలేరుకు ఇవ్వలేదు.
సాహిత్య విమర్శలో కులతత్వం
వామపక్ష సాహిత్య ఉద్యమం బ్రాహ్మణులకు ఇచ్చిన ప్రచారాన్ని దళితులకు ఇవ్వలేదు. వేమన, కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్న వంటి కవులు కందుకూరి, గురజాడ, శ్రీశ్రీ వంటి వారికి ఏ స్థాయిలోను తీసిపోరు. అయితే శ్రీశ్రీ తన సాహిత్యం విమర్శలో ఎన్నడూ దళిత కవులను స్థావించలేదు. ఆయన గురజాడకు, కృష్ణశాస్త్రికి ఇచ్చిన ప్రచారంలో వందో వంతు కూడా దళితుల గురించి ప్రస్థావించలేదు. తెలుగు సాహిత్య విమర్శలో కులతత్వం వుంది. అందుకే అది విస్తరించాల్సినంత విస్తరించలేదు. కన్నడ, తమిళ, మరాఠి సాహిత్యంలో దళిత నాటకానికి ప్రధానమైన స్థానం వుంది. అట్టడుగు ప్రజల జీవన ఘోషలు, వ్యధలు ఆ నాటకాల్లో దృశ్యీకరించ బడుతున్నాయి. నాటకాల ప్రభావం సినిమాల మీద కూడ వుంటుంది. తెలుగు సినిమా ఈనాడు కథలకు భిక్షమెత్తుకోవడానికి కారణం అట్టడుగు వర్గాల ప్రజల భాషని, సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడమే.
కవితా భాష
బోయి భీమన్న సాహిత్యంలో భాషా సామర్థ్యం ఎక్కువ. చీకటిపొలం, వెలుగు పైరు, విత్తనం చెట్టు అవడం వెలుగు, చెట్టు విత్తనం చీకటి అని ‘గుడిసెల’ గుండెల్లో దాగివున్న అంతర్మథనాన్ని బయటికి తీసిన కవి ఆయన. భీమన్న కవితా భాష తెలుగు విద్యార్థుల నాలుకల మీద నర్తించినప్పుడు తెలుగు జాతిలో కొత్త వికాసం వస్తుంది. ఆయన ధర్మం కోసం పోరాడటంలో
అడిగితే కాని అమ్మైనా పెట్టదు
ఏడ్చే వాడికే పాలు పడుతుంది,
ఆందోళన చేస్తేనే గాని
అవసరాలు గుర్తించబడవు,
అందుకే మేల్కొనండి
ప్రజలను మేల్కొలపండి
ఏకం కండి
ఎలుగెత్తి అడగండి (ధర్మం కోసం పోరాటం - 290)
భీమన్న గారి ప్రతీ మాట ధ్వని సామర్థ్యం కలిగి మెదడును మేలుకొల్పి నిస్సత్తువ, నిర్వీర్యాన్ని తొలగించి సామాజిక విప్లవ సమరం చేస్తుంది. దళిత కవులకు సన్మానాలు బిరుదులు ఇవ్వడంలో వాళ్ళకు వొరిగేదేమీ లేదు. వారి భాషని ప్రజల్లోకి తీసుకెళ్ళి, సమాజంలో పాదుకొల్పి, సాహిత్య చరిత్రలో వారి స్థానాన్ని సుస్థిరం చేసి, నిర్లక్ష్యం చేయబడిన ప్రజల్లో దాగివున్న సాంస్కృతిక విలువలను మొత్తం జాతికి అందించి, కొత్త వెలుగులు ప్రసరింప చేయాల్సిన బాధ్యత మన మీద వుంది.
పదివేల పదాల నిఘంటువు బోయి భీమన్న
ఒక బోయి భీమన్న కవిత్వంలో మనకి పదివేల పదాల వరకు తెలుగు నిఘంటువు రూపొందే అవకాశం వుంది. ఎందుకు ఆయన కవిత్వం నిఘంటువును తయారు చేసుకోలేకపోతున్నాం? తెలుగు భాష మీద మనకుండే నిర్లక్ష్యమే దీనికి కారణం. తమిళులు 30 కోట్ల రూపాయలు తమ బడ్జెట్టులో తమ భాషాభివృద్ధికి ఉపయోగిస్తే ఒక్క రూపాయి కూడా మనం భాషాభివృద్ధికి కేటాయించుకోలేకపోతున్నాం అంటే తెలుగు జాతిని రాజకీయ భావదారిద్య్రం వెంటాడుతున్నది. ఎండు కట్టెలు వంటి నాయకులు ఈ నేలను పరిపాలిస్తున్నారు. ఒక జాతికి వెన్నెముక అయినటువంటి భాషని, భాషాభివృద్ధిని, భాష పరిశోధనని నిర్లక్ష్యం చేస్తే ఆ భాషా, జాతి ముందుకు వెళ్ళదు అని గమనించలేకుపోతున్నారు. భాష ఎర్పడటంలో వున్న అంతర్గర్భిత భావాన్ని రూపొందించకుండా, అణగారిన ప్రజల హృదయధ్వనుల్ని సమీకరించకుండా, ఆ సమాజం ముందుకు వెళ్ళలేదు అనే చారిత్రక సత్యాన్ని మన పాలకులు గమనించలేకపోతున్నారు.
తెలుగు భాషోద్యమం నడవకపోతే తెలుగు జాతి మనుగడ కష్టం
ఇప్పటి వరకు తెలుగు భాషలో వస్తున్న నిఘంటువులు తెలుగు భాష పేరుతో చెలామణి అవుతున్న కవులు ఎక్కువ మంది సంస్కృతాన్ని తెలుగుగా చెలామణి చేసిన వారే. కాని నిజమైన తెలుగు భాష మన భూమిలో, మన నీటిలో, మన నాట్లలో, మన కోతల్లో, మన అడవుల్లో, మన శ్రమలో, మన దు:ఖంలో, మన వేదనలో, మన సంతోషంలో, మన సంఘర్షణలో వుంది. అది అట్టడుగు ప్రజలు, సమాజం చేత నిర్లక్ష్యం చేయబడిన ప్రజలు కొన్ని యుగాలు, చీకటి గుహల్లో మగ్గిన ప్రజల నుండి పుట్టిన కవుల్లో వుంది.
ఈనాడు తెలుగు భాషా పునరుజ్జీవనోద్యమం అట్టడుగుల ప్రజల నుండి రావాల్సివుంది. ఎవరు సంస్కృతాన్ని, ఇంగ్లీషుని నిజమైన తెలుగు ప్రజల మీద రుద్దుతున్నారో వారు ప్రపంచ బ్యాంకు అధీనులే తెలుగు జాతి పునాదుల్ని దెబ్బతీయాలని దాని ఉనికిని కూల్చాలని చూస్తున్నారు. ఈ చారిత్రక సందర్భంగా రాజకీయంగా ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరు తమ భాషని గురించి కూడా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం వుంది. ఉద్యమాలు నడపాల్సిన అవసరం వుంది. అలా నిలదీయలేకపోయినట్లైతే, పోరాటాలు చేయకపోయినట్లైతే తెలుగు జాతి మనుగడ ప్రశ్నార్థకం కాక తప్పదు.