గిడుగు కృషిఫలితమే నేటి తెలుగు వెలుగు - భద్రిరాజు కృష్ణమూర్తి /


ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచన రచనకు కావ్యభాష పనికిరాదనీ, సామా న్యజనానికి అర్థమయ్యే సమకాలీన 'శిష్ట వ్యావహారికం' లో ఉండాల నీ ఆనాటి సాంప్రదాయిక పండితులతో హోరాహోరీగా యుద్ధం చేసి ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్ఠించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

Gidugu Rammurthyగిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇర వైమైళ్ళ దూరంలో ఉన్న పర్వతాల పేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాల పేట ఠాణాలో సముద్దారు (రెవిన్యూ అధికారి) గా పనిచేస్తుండేవారు. 1875 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీఅయి అక్కడే విషజ్వరంతో 1875లోనే చనిపోయారు. విజ యనగరంలో మేనమామగారి ఇంట్లోఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష ప్యాసయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు ఆయనకు సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లికూడా అయింది. 1888లో ముప్పై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్ట్‌ఫారం విద్యార్థులకు చరిత్ర బోధించే అధ్యాపకుడయినాడు. సంసార బాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడ్డది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటి రెండు భాగాలు, 1896లో మూడోభాగం ప్యాసై పట్టా పుచ్చుకున్నారు. ఇంగ్లీషు, సంస్క­ృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసు కుని రాష్ట్రంలో ఫస్టుక్లాసులో, రెండో ర్యాంకులో ఉత్తీర్ణులైనారు. రాజావారి హైస్కూ లు కాలేజీ అయింది. అప్పుడు ఆయనకు కాలేజీ తరగతులకు పాఠాలు చెప్పేయో గ్యత వచ్చింది.

ఆ రోజుల్లోనే ఆయనకు దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు సవర భాషలు రెండూవచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవర భాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యా పకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసు ప్రభుత్వం వారి కృషికి మెచ్చి 1913 లో 'రావ్‌ బహదూర్‌' బిరుదు ఇచ్చా రు. భాషా శాస్త్రంలో అప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్పై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవర భాషా వ్యాక రణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. సవర దక్షిణ ముండా భాష. మన దేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించి నవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండా భాషలు. ఆర్యభాషా వ్వవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ.15 వ శతాబ్ది) నుంచి వీళ్ళు మన దేశంలో స్థిరపడ్డారు. వీరిని 'శబరు'లనే ఆదిమ జాతిగా ఐతరేయ బ్రాహ్మణంలో (క్రీ.పూ. 7వ శతాబ్ది) పేర్కొన్నారు. హైస్కూల్లో చరిత్ర పాఠం చెప్పేరోజుల్లోనే దగ్గిరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివారు. విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రాకాంశాలు, ముఖ్యంగా గాంగ వంశీయులనుగురించి రామమూర్తి ఇం గ్లీషులో ప్రామాణిక వ్యాసాలు రాసి 'ఇండియన్‌ యాంటిక్వైరీ'లోనూ, 'మద్రాస్‌ లిట రేచర్‌ అండ్‌ సైన్స్‌ సొసైటీ జర్నల్‌' లోనూ ప్రచురించారు. 1911లో గిడుగువారు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషా సంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది.

వచన భాషా సంస్కరణోద్యమం 1911-15
1907లో జె.ఎ. యేట్స్‌ అనే ఇంగ్లీషు దొర ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్‌స్పె క్టరుగా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆయ నకు అర్థం కాలేదు. ప్రజల వ్యవహరించేభాష పుస్తకాలభాష మధ్య ఎందుకు తేడా లున్నాయి అన్నది ఆయన ముఖ్య సమస్య. అంతకుముందు తమిళదేశంలోనూ అదే సమస్య ఆయన్ను వేధించింది. విశాఖపట్నంలో మిసెస్‌ ఎవియన్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ గా ఉన్న పి.టి.శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నారు. ఆ విధంగా గిడుగు వారు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్నిగురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యా విధానంలో అన్యాయం జరుగుతున్నదనిగుర్తించారు. గురజాడ, గిడుగులు శ్రీనివాస అయ్యంగారు, యేట్సు దొర- నలుగురి ఆలోచనలవల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతియేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యాన్ని గురించి ఉపన్యాసాలిచ్చారు.

విజయనగరంలో 'ఆంధ్ర సాహిత్య సంఘము' ఏర్పడ్డది; దానికి గిడుగురామ మూర్తి ఉపాధ్యక్షుడు; బుర్రా శేషగిరిరావు కార్యదర్శి. 1911లో శ్రీనివాస అయ్యం గారు పండితుల వాదాన్ని ఖండిస్తూ ఇంగ్లీషులో 'డెత్‌ ఆర్‌ లైఫ్‌: ఎ ప్లి ఫర్‌ వెర్నా క్యులర్‌' అనే పుస్తకాన్ని ప్రచురించారు. అదే సంవత్సరం చెట్టి లక్ష్మీనరసింహం గ్రీకు మిత్తులు అనే పుస్తకాన్ని అచ్చువేశారు. 1912-13లో స్కూల్‌ ఫైనల్‌లో వ్యాసరచన కావ్యభాషలో గాని, ఆ«ధునిక భాషలో గాని చేయవచ్చునని స్కూల్‌ ఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక జీవో ఇచ్చాడు. ఆధునిక భాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ను, ఏనుగు వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రను ఉదాహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరిం ది. మద్రాసులో జయంతి రామయ్య అధ్యక్షతన 'ఆంధ్ర సాహిత్యపరిషత్తు' ఏర్పడ్డది. వావిలకొలను సుబ్బారావు, వేదం వెంకటరాయశాస్త్రిలాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన రీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశారు. ప్రభుత్వానికి ఎన్ని మహజర్లు వేల సంతకాలతో గ్రాంథిక వాదులు పంపినా పై ఉత్త ర్వులు ఉపసంహరించలేదు.

1913 ఏప్రిల్‌ నెలలో మద్రాసు యూనివర్శిటీ వారు ఎఫ్‌.ఏ.లో తెలుగు వ్యాసరచనకు ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించడానికి 'కాంపొజిషన్‌ కమిటీ'ని నియమించారు. దానిలో (ఎ) ఆధునికుల ప్రతినిధులుగా గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, పి.టి. శ్రీనివాస అయ్యంగారు, బుర్రా శేషగిరిరావులను, (బి) ప్రాచీన భాషవాదుల ప్రతినిధులుగా.. వేదం వేంకటరాయశాస్త్రి, జయంతి రామయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, జి. వేంకటరంగయ్యలను నియోగించారు. మధ్యస్థులుగా ఆర్‌. రంగాచారి(అధ్యక్షుడు), థామ్సన్‌ నియుక్తులైనారు. రంగాచారి ముగ్గురు వ్యక్తులతో ఒక సబ్‌కమిటీవేసి 'ఆధునిక-ప్రాచీన' రూపాల జాబితాలు రాయమని నిర్దేశించాడు.

పై ఆదేశానుసారం ఆధునిక రూపాలనే గిడుగు, గురజాడలు సేకరిస్తే, కొమర్రా జు, జయంతి ప్రాచీన రూపాల జాబితాలు రాశారు. "As well as' అంటే సాహిత్య భాషలో ఉండి ఇప్పటివాళ్ళకు గూడా అర్థమయ్యే రూపాలనే విపరీతార్థం తీశారు. ఈ లోపల మరో నలుగురు సభ్యులను రాయలసీమ నుంచి కమిటీలో వేశారు. వాళ్ళంతా గ్రాంథికవాదులే. ఎక్కువమంది గ్రాంథికంవైపు మొగ్గటంతో వ్యావహారికవాదుల తీర్మానం నెగ్గలేదు. మద్రాసు యూనివర్శిటీ సిండికేటు ఆగస్టు 11, 1914న. "...That the Syndicate with the information that the Syndicate is not at present in a position to recognize what is know as Modern Telugu for University purposes'. గురజాడ అప్పారావు "Minute of Dissent'ను కాంపొజిషన్‌ సబ్‌ కమిటీకి అందజేశాడు. ఇది వ్యావహారిక భాషోద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి. యూనివర్శిటీ నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 12, 1951న శైలీ స్వేచ్ఛను ఉపసంహరిస్తూ ఒక ఉత్తరువు జారీ చేసింది. విద్యా విధానంలో వ్యవహార భాషకు స్థానం లేకుండా పోయింది. ఈ పరిస్థితి 1970లదాకా సాగింది.

1915-40
స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథిక భాషే పాతుకుపోయింది. కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళగ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాం థికంలో ఏ రచయితా నిర్దుష్టం గా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు 'తెలుగు' అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరా టం సాగించాడు. కానీ ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్జుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్జల చినసీతారామస్వామిశాస్త్రి మొదలైన కవులు పండితులు వ్యావహారిక భాషా వాదంవైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా 'వర్తమానాంధ్రభాషాప్రవర్తక సమాజం' స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతిమహోత్సవం రాజమహేంద్రవరంలో ఆయన అభిమానులు, శిష్యులు బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చి న 46 పరిశోధక వ్యాసాలతో Miscellany of Essays (వ్యాస సంకలనం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. (?) 1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు అధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్య సాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్ట వ్యావహారికాన్ని ప్రోత్సాహించే 'ప్రతిభ' అనే సాహిత్య పత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా 'జనవాణి' అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టింది. గిడుగువారి సవర భాషా కృషికి మెచ్చి Kaizer-e-Hind పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు. గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న కన్నుమూశారు. 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సం తృప్తి పొందారు. కానీ, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టకపోవడానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరి మాటలు:

'దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారిక భాష లోకంలో సదా వినబడుతూ ఉంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడేదేకాని వినబడేదికాదు. ప్రతిమ వంటిది. ప్రసం గాలలో గ్రాంథిక భాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకొన్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి...
......'స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రముకోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామికపరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏ భాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథ రచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీ చేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు.'

కాలం కంటె ముందున్న గిడుగు
గిడుగువారి జీవితపాఠం, ప్రతిభావంతుడు స్వయంకృషితో ఎంత ఎత్తుకన్నా ఎదగవచ్చుననేది. ఆయన తన కాలానికి యాభై ఏళ్లు ముందుపుట్టారని చెప్పాలి. సొం తంగా చదివి భాషాశాస్త్రం, ధ్వనిశాస్త్రం నేర్చుకున్నారు. ఆయన డేనియల్‌ జోన్స్‌ వాడిన అంతర్జాతీయ ధ్వని సంకేతాల ప్రయోగం, పుస్తకాలు చూసి సొంతంగా నేర్చుకున్న భాగమే ఎక్కువ. డేనియల్‌జోన్స్‌ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో పదిహేనురోజుల పాటు Phonetics పాఠం చెప్పారట. రామమూర్తిగారు, సీతాపతిగారు ఆ క్లాసులకు వెళ్ళారుట. సమకాలీనుల్లో ఉద్దండులైన భాషా శాస్త్రజ్ఞులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. Sir George Grierson, Jules Bloch, L.V. Rama -swamy Aiyar మొదలైనవాళ్ళు. 40 ఏళ్ల తరువాత వ్యావహారిక భాషోద్యమం లో దిగి అనితరసాధ్యమైన విజయాలు సాధించారు. ఆయన సవర భాషకు చేసిన సేవ తెలుగుభాషకు చేసినదానికంటె ఎక్కువ సృజనాత్మకమైనది, మరెవ్వరూ చేయనిది అని కొందరు అనుకోవచ్చు. గ్రాంథిక భాషావాదులు గెల్చినా గ్రాంథిక భాషావాదం ఓడిపోయింది.