ఆంధ్రుడా! /


ప్రజాకవి కీ.శే. కాళోజీ నారాయణరావు తెలుగు రుచిని, వాడినీ, వేడినీ పుణికి పుచ్చుకున్న కవి.
తెలుగు భాషా సంస్కృతుల వికాసానికై అంకితమైన కాళోజీ, మరాఠీ మాతృభాషకు చెందిన వంశీకుడు. అయినా, తెలుగన్నా, తెలుగువారన్నా ఎంతో అభిమానం. తెలుగు జనజీవనంతో మమేకమైపోయిన కాళోజీ నారాయణరావు అర్థ శతాబ్దం క్రితమే తన ఆవేదనను వెలిబుచ్చిన తీరు చూడండి... మరి, మన కోసం మనం ఉద్యమించుదామా?


ఆంధ్రుడా!

ఏభాషరా నీది యేమి వేషమురా?
ఈ భాష ఈ వేష మెవరి కోసమురా?
ఆంగ్లమందున మాటలాడ గలుగగనే
ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?
సూటు బూటు హ్యాటు షోకుగా దొడుగ
ఘనతేమి వచ్చెరా గర్వమేటికిరా? || ఏ భాషరా ||

ఉర్దు మాటలాడి యుబ్బుబ్బి పడుటకు
కారణంబేమిటో కాస్త చెప్పుమురా?
లాగు షేర్వాణీలు బాగుండుననుచు
మురిసిపోయెదవంత మురిపమేమిటిరా? || ఏ భాషరా ||

నీ వేషభాషలిల నిగ్గుదేలినవన్న
విషయంబు నీవేల విశ్వసింపవురా?
నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి
కారకుడవీవయని కాంచవెందుకురా? || ఏ భాషరా ||

నీ వేషభాషలను నిర్లక్ష్యముగ జూచు
భావదాస్యం బెపుడు బాసిపోవునురా?
నీ భాషయందును నీ వేషమందును
స్వాభిమానముడిగిన చవటనీవేరా? || ఏ భాషరా ||

తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచును
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?
దేశ భాషలందు తెలుగు లెస్స యటంచు
తెలుగు బిడ్డా! యెపుడు తెలుసుకొందువురా?
తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? || ఏ భాషరా ||

( మే 2004 - "నడుస్తున్న చరిత్ర " పత్రిక నుండి తీసుకోబడినది.)