(రోహిణీ ప్రసాద్)
చిన్నపిల్లలు ఏదో కథను ఊహించుకుని, దాన్ని వర్ణించడానికి బొమ్మలు గీస్తారు. చూసినవారికి అర్ధంకాక అదేమిటని అడిగితే అమాయకంగా ముద్దు మాటలతో కథను వర్ణిస్తారు. తొలి దశలోని చిత్రలిపులు ఇటువంటివే. అంతేకాదు; ఈ బొమ్మల వరసలో వ్యాకరణబద్ధమైన వాక్యనిర్మాణానికి వీలుండదు. అవన్నీ ''చదువరులు'' ఊహించుకోవలసిందే. లిఖిత సమాచారం చాలా తక్కువగా అవసరమూ, లభ్యమూ అయే సామాజిక పరిణామదశలో లిపి ఇలాగే ఉండేది. రానురాను ఇటువంటి సందేశాలకు సరైన అర్ధం తెలియవలసిరావడంతో పదాల వెంట విభక్తులవంటివి చేర్చడం మొదలైంది.
అసలు ప్రాచీన లిపిని చదవడంలోని ఇబ్బందులెటువంటివి? ఈ విషయంలో చిక్కులు తెచ్చిపెట్టేది సింధు లిపి ఒక్కటే కాదు; క్రీ.పూ. 1800 గ్రీక్ లిపీ, క్రీ.పూ.500 ప్రాంతపు మెక్సికో లిపీ, క్రీ.పూ. 300లో సుడాన్‌లో మొదలైన లిపీ వగైరాలెన్నో ఉన్నాయి. మూడు లిపులలో ఒకే సమాచారం కనబడుతున్న రోసెటా శివంటిది దొరికాక కూడా ఈజిప్ట్ లిపిని అర్ధం చేసుకోవటానికి పాతికేళ్ళకు పైగా పట్టింది. ఇతర ఆదారాలేవీ లేనప్పుడూ, పురాతన భాష పూర్తిగా అంతరించిపోయినప్పుడూ మనకు కనబడుతున్న గీతల్లోని భావం ఊహించాలే తప్ప ఖచ్చితంగా చెప్పడం వీలవదు. అప్పటి నాగరికతలో మౌఖిక భాషకూ, లిపిబద్ధం చేసిన అక్షరాలకూ ఎంతటి, ఎటువంటి సామ్యం ఉందో, అసలు లిపిని చదవగలిగిన శక్తీ, అవసరమూ అప్పటి సమాజంలో ఎవరికి ఉండేవో ఇవన్నీ లెక్కలోకి వస్తాయి.
వివిధ ప్రాచీన లిపుల్లో దాదాపు ఒకే రకమైన బొమ్మలు గీసే పద్ధతి కనబడుతుంది. పటంలో చూపినట్టుగా మొదట్లో కాస్త వివరంగా కనబడుతున్న చిత్రం తరవాత కాస్త సాదాగా తయారవుతుంది. అంటే ఏది దేన్ని సూచిస్తోందో చూడగానే అర్ధం అవుతోందన్నమాట.
పటంలో చూపిన లిపుల బొమ్మలు, అర్ధాలు-
మొదట్లో ఈ సంకేతానికి అర్ధం ఆ బొమ్మలోని వస్తువే. ఆ తరవాత వస్తువు పేరుకూ, దాన్ని పోలిన మాటలకూ వేరే అర్ధాలు ఉన్నప్పుడు వాటికి కూడా ఇదే బొమ్మను వాడడం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి ఆ భాష తెలిసివారు ఏ బొమ్మ దేనికి సంకేతమో అర్ధం చేసుకుంటారు గనక పని గడిచిపోతుంది. ఉదాహరణకు ఇదే తెలుగు అయితే పర్వతాలు కొండలను కాకుండా పర్వతాలు అనే పేరుగల వ్యక్తిని సూచిస్తున్నాయనుకోవచ్చు. పర్వతాలుగారి ఇంటికి ఇటువంటి బోర్డు వేలాడుతూంటే అది పర్వత ప్రాంతమని ఎవరూ పొరబడరు. ఇదంతా ఉత్తుత్తి కథే అయినప్పటికీ దీనివల్ల సమస్య ఎటువంటిదో తెలుసుకోవచ్చు. చిక్కెక్కడోస్తుందంటే ఏ కారణం చేతయినా ఆ నాగరికతా, ఆ భాషా అంతరించిపోతే తరవాతి వారికి ఈ లిపి ఏమీ అర్ధంకాదు.
లిపి అనేది ఒక్కసారిగా పరిపూర్ణమైన పద్ధతిలో ఎక్కడా అవతరించదు. లిపి తయారవని పూర్వదశలో బొమ్మలు గీసే పద్ధతే అమలులోకి వస్తుంది. వాటిలో కొన్ని పూర్తి వాక్యాన్నో, వ్యాఖ్యానాన్నో సూచిస్తాయి. ఆ తరవాతి దశలో వాటిని పదాలుగా విడగొట్టవలసిన పరిస్థితి వస్తుంది. మామూలుగా కనబడేవాటిని చిన్న బొమ్మల్లో గీసి సూచించడం సరిపోతుంది కాని, భావాలకూ, విశేషణాలకూ శ్లేష పద్ధతిలో వాటిని చిత్రించడం జరిగేది. ఉదాహరణకు ''బల్లపరుపు'' అనే మాటకు బల్లనూ, పరుపునూ, అలాగే ''చుట్టకుండ'' అనే మాటను తెలిపేందుకు చుట్ట, కుండ అనే వాటినీ బొమ్మలుగా పక్కపక్కనే గీసుకోవచ్చు. తెలుగువంటి భాషలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదుగాని ఈ పద్ధతి ఎటువంటిదో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు పనికొస్తాయి. ఈ పద్ధతి తెలియాలంటే చదివేవాడికి తెలుగు వచ్చితీరాలి. ఈ బొమ్మలను ఇతర భాషీయులు తమ పదాలుగా గుర్తించి, తలిపి చదివితే ఏమీ బోధపడదు.
శ్లేష కొన్ని పొరబాట్లకు దారితీస్తుంది. ఉదాహరణకు ప్రాచీన సుమేరియన్ భాషలో బాణం అనడానికీ, ప్రాణం, పక్కటెముక అనడానికీ కూడా ఒకేలాంటి మాట ఉండేదట. ప్రాచీన శాసనాల్లో బాణం గుర్తు కనబడటంతో కొన్నాళ్ల తరవాత ఫలానా ''ప్రాణదేవత'' మరొక దైవపురుషుడి పక్కటెముకకు చికిత్స చేసిందనే గాథ మొదలైందట. ఏనాడో మొదలైన ఈ అపార్ధాలు తరవాత ఇతర భాషల్లోకి కూడా పాకాయి. పై అర్ధాలకు హీబ్రూ భాషలో వేరువేరు పదాలున్నప్పటికీ సృష్టిలో అందరికీ జన్మ నిచ్చిన ఆదిమాత ఈవ్ (హీబ్రూలో హవ్వ అంటారు. తెలుగులో పెద్దావిడను అవ్వ అనడం గమనార్హం) ఆడమ్ పక్కటెముకనుంచి పుట్టిందనే గాథ తలెత్తింది. ఇవేవీ తెలియని ఆధునిక మతబోధకులు ప్రతిదానికీ ''సింబాలిక్'' అర్ధాలుంటాయని నమ్మబులుకుతారు.
మన దేశపు తొలి లిపిగా భావించబడుతున్న సింధు లిపి అక్షరాల నమూనాలన్నీ ఎక్కువగా అంగుళం, రెండంగుళాల సైజులో ఉన్న చిన్న చిన్న ముద్రికల మీద కనిపిస్తున్నదే. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ముద్రికల్లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. 1960లలో తొలిసారిగా వీటి విశ్లేషణకై సోవియట్, ఫిన్లండ్ బృందాలు కంప్యూటర్లను వాడారు. అప్పటి నుంచీ ఎడతెగకుండా పరిశోధనలు జరుగుతున్నపటికీ ఎవరికి తోచిన పద్ధితిలో వారు ''ఫలితాలను'' వెల్లడిస్తూ వచ్చారుగాని అందరి మధ్యా ఏకాభిప్రాయం కుదరనే లేదు. అసలే సాక్ష్యాలు తక్కువ; అందులోనూ ఈ అన్వేషణకు సహాయపడగలిగి, అప్పటి భాషను గురించి ఇతరత్రా తెలియజెప్పగలిగిన మరే వివరాలూ ఎక్కడా దొరకలేదు. ఈ కష్టాలకు తోడుగా అన్వేషకుల రాజకీయ ధోరణులు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. అతి ప్రాచీనమైన ఆ భాష కేవలం సంస్కృతానికి ఒక పూర్వరూపమని కొందరు నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని మరికొందరి వాదన. వీరిలో కనీసం కొందరికైనా ఆర్య-ద్రావిడ విభేదాలను గురించిన పక్షపాత వైఖరి ఉందనడంలో సందేహం లేదు.
లిపి సంగతి అలా ఉంచితే సింధు నాగరికతలో ప్రజలు ద్రావిడభాష ఏదైనా మాట్లాడేవారా? మనకు తెలియదు. ప్రస్తుతం అవన్నీ వినబడే ప్రాంతాలు అక్కడికి 800 మైళ్ళ దూరాన ఉన్నాయి. కాని, పాకిస్తాన్‌కు పశ్చమానా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాల్లోనూ కొన్ని తెగలు ఈనాటికీ మాట్లాడే బ్రాహుయీ భాష ద్రావిడ కుటుంబానికి చెందినట్టుగా తెలుస్తోంది.
సింధు నాగరికత ప్రాంతాలు
అలాగే ఈనాటి ఇరాన్‌లోని నైరుతి ప్రాంతంలో ఒకప్పటి సుసా నగరవాసులు మాట్లాడిన ప్రాచీన ఈలమైట్ భాషలో ద్రావిడ శబ్దాలుండేవట. సింధు ప్రజలు మాట్లాడినది సంస్కృతాన్నీ, దాని మాతృక అవదగిన ఇండో ఇరానియన్ భాషనూ పోలి ఉండేదనే ప్రతిపాదనకు పాశ్చాత్య పరిశోధకులు అంగీకరించరు. ఎందుకంటే క్రీ.పూ. 3200 ప్రాంతంలో మన దేశం వైపుగా పశ్చిమం నుంచి ఎవరైనా వలస వచ్చిన దాఖలాలు కనబడవు. 140 ఏళ్ళ క్రితం ఇలా వాదించిన అన్వేషకుల సాంస్కృతిక దృక్పథంలో వలసవాద వైఖరి ఉందని ఆక్షేపించవచ్చునేమోగాని ఈరోజుల్లో అత్యాధునిక పద్ధతుల్లో పరిశీలనలు జరుపుతున్నవారికి అంటువంటి ధోరణిని ఆపాదించడం కష్టం. అందుచేత ఆ భాష ఏదో ద్రావిడశైలిదే అయి ఉండాలి. ఈ రెంటికీ చెదినది కాని పక్షంలో దాన్ని మనమీనాడు అర్ధం చేసుకోగలగడం అసాధ్యమే.
సింధులిపిలోని రహస్యాలను భేదించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోకుడి నాటికి వ్యాప్తిలోకి వచ్చిన బ్రాహ్మీలిపి ఆధునిక భారతీయ లిపులన్నిటికీ మాతృక. దానికీ ఈ సింధు లిపికీ మధ్య పూడ్చలేని ఎడం కనిపిస్తోంది. పటంలో చూపినట్టుగా ఎంతో విశాల ప్రాంతాలకు విస్తరించిన సింధు నాగరికతకు చెందిన ఈ లిపీ, భాషా ఎటువంటివో తెలుసుకోవడం గడ్డు సమస్యగా తయారయింది.