దివాణంలో ఆడుకునేవాళ్లం - మాలతీ చందూర్‌... /


స్వాత్రంత్యం రాక పూర్వం 1940లలో నూజివీడులోని రాజావారి దివాణంలో ట్యూషన్‌ చెప్పడానికి సరోజిని అనే ఆవిడ గుర్రపుబండిపై వచ్చేవారు. ఆ రోజుల్లోనే బిఎ పూర్తి చేసిన సరోజిని చాలా నాజుగ్గా, మంచి మేనిమిఛాయతో అందంగా ఉండేవారు. దివాణానికి వచ్చే సరోజినిని పక్కనే ఉన్న పాఠశాలలో చదువుతున్న కొంతమంది ఆడపిల్లలు ఆసక్తిగా గమనించేవారు. వారంతా తాము కూడా సరోజినిలా చదువుకుని అందంగా ముస్తాబు కావాలని చర్చించుకునేవారు.

= = =

ఆ తరువాత చాలా ఏళ్ళకు...

వారిలో ఒకమ్మాయి పెద్ద చదువులైతే చదవలేదు కానీ గొప్ప రచయిత్రిగా పేరు సంపాదించింది. ఆమె రాసిన 'హృదయనేత్రి' అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.

= = =

ఆమే ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌...

187 సంవత్సరాల మాలతీ చందూర్‌ 'ఆడవాళ్ళు చదువుకోవాలి, వారికి సొంత వ్యక్తిత్వం ఉండాలి' అంటారు. అందుకే కాబోలు ఆమె రచనల్లో మహిళలే ప్రధాన భూమిక పోషిస్తారు. కృష్ణాజిల్లాకు చెందిన ఈ స్త్రీవాద రచయిత్రి ఇప్పటి వరకు సుమారు 12 నవలలను రాశారు. మాలతీ చందూర్‌ తన రచనలకు గాను పలు పురస్కారాలను కూడా అందుకున్నారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం మాలతిని డాక్టరేట్‌తో సత్కరించింది. భారతీయ భాషా పరిషత్‌ నుండి ఒకసారి, పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుండి రెండు సార్లు మాలతి పురస్కారాలను అందుకున్నారు. 'ఆలోచించు', 'శతాబ్ది సూర్యుడు', 'భూమి పుత్రుడు', 'ఎన్ని మెట్లెక్కినా' మొదలైనవి వీరి నవలల్లో కొన్ని. ఇటీవల మాలతీచందూర్‌ నవలలను విశ్లేషిస్తూ ఓల్గా 'నవలా మాలతీయం' అనే పుస్తకాన్ని కూడా తీసుకువచ్చారు. ప్రస్తుతం చెన్నయ్‌లో ప్రశాంత జీవితం గడుపుతున్న మాలతీ చందూర్‌ను 'నా బాల్యం' శీర్షక కోసం 'ఆన్‌లైన్‌' పలుకరించింది. వెంటనే ఆమె తన చిన్న నాటి జ్ఞాపకాలను, ఊరుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ జ్ఞాపకాలు, అనుబంధం ఆమె మాటల్లోనే...

'మా ఊరు కృష్ణా జిల్లాలోని నూజివీడు. 1930లో నేను నూజివీడులోనే జన్మించాను. అమ్మ జ్ఞానాంబ. నాన్న వెంకటేశ్వర్లు. అమ్మానాన్నలకు మేం ఆరుగురం. అందరికంటే నేను చిన్నదాన్ని. మా ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం. మా ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్‌షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. నా బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. నేను 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివాను.

చద్దన్నం తిని స్కూల్‌కు వెళ్లే వాళ్లం

4ఉదయాన్నే లేచి చద్దన్నం తిని స్కూలుకు వెళ్ళేవాళ్ళం. ఆయాలు ఇంటికి వచ్చి మమ్మల్ని స్కూలుకు తీసుకెళ్ళేవారు. ఆ రోజుల్లోనే మా స్కూల్లో క్రాఫ్ట్‌, సంగీతం టీచర్లు ఉండేవారు. మేము టీచర్లను మాష్టారుగారు, పంతులమ్మ గారు అని పిలిచేవాళ్ళం. మా స్కూల్లో ఆరోగ్య వారాలు నిర్వహించేవారు. నేను కూడా ఈ ఆరోగ్యవారాల్లో పాల్గొని పాటలు పాడేదాన్ని. 'మానరా ఈ మలుపు చుట్ట మనుషులకు మర్యాద కాదు...', 'దోమలే మన శత్రువులు...' అంటూ పాటలు పాడటం నాకు బాగా గుర్తు. నూజివీడులోని కొత్తపేటలో మా ఇల్లు ఉంది. మాది మండువా ఇల్లు. ఇంటికి ఎదురుగా ఊడలు దిగిన మర్రి చెట్టుండేది. నేను ఈ చెట్టు దగ్గరే ఆడుకునేదాన్ని. స్కూలుకు వెళ్ళే దారిలో దివాణానికి అటూ, ఇటూ రెండు గోడలు, దివాణం ముందర రెండు పెద్ద ఏనుగు బొమ్మలుండేవి. ఇప్పటికీ ఈ బొమ్మలు అలాగే ఉన్నాయి. దివాణం గోడల మధ్య ఇసుక ఉండేది. స్కూలులో ఖాళీ దొరికిందంటే ఈ ఇసుకే మా ఆటస్థలం.

ముంజెలంటే ఇష్టం

2అప్పుడప్పుడు ఇంట్లో అడిగి మామిడితోటలకు వెళ్ళి కాయలు కోసుకునేవాళ్ళం. చాలాసార్లు ఇలా తెచ్చుకున్న మామిడికాయలు, తీగలు, ముంజెలతో టిఫిన్లు కానిచ్చేసేదాన్ని. ఊరినుండి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్ళినప్పుడు అక్కడ మొక్కజొన్న పొత్తులు తినటం, గోళీసోడాలు తాగటం మాకు క్రేజ్‌. మా ఊర్లో సంక్రాంతి, దసరా పండుగలను వైభవంగా జరిపేవారు. జమీందార్లు దసరా ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించేవారు. ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపులు జరిపేవారు. ఇలా రాత్రి పూట జరిగే ఉత్సవాల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, బుట్టబొమ్మలను చూసి ఆనందించేదానిని. దసరా సంబరాల్లో భాగంగా రాత్రిపూట పులివేషాలు వేసేవారు. దసరా జరిగే పది రోజులు మా తాతగారు పొద్దున పూట బాల పూజ చేసేవారు. బాలపూజ అంటే పది సంవత్సరాల్లోపు పిల్లలను కూర్చోబెట్టి దేవునికి పూజ చేసేవారు. పూజలో భాగంగా పిల్లలపై కూడా పూలు చల్లుతుంటారు. ఇలా నాపైన పూలు చల్లుతుంటే తెలియని ఆనందంతో నవ్వుకునేదాన్ని. అప్పటికీ నా వయసు 8సంవత్సరాలు. ఇక సంక్రాంతి పండగనైతే చాలా సంబరంగా జరుపుకునే వాళ్ళం. సుతార్ల వీధిలోని రామమందిరంలో తెల్లవార్లూ శ్రీ కృష్ణలీలలు నాటకాన్ని వేసేవారు. ఈ నాటకంలో వెన్న చిలికే సన్నివేశాలలో నురగ వస్తుంటే వెన్న వస్తుందేమో తిందామని ఆశగా చూసేదాన్ని. అయితే ఒకసారి నాటకం మొత్తం పూర్తయ్యాక ఆ నురగ వెన్న వల్ల రావడం లేదని కుంకుడుకాయ రసం వల్ల వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ విషయం గుర్తుకువస్తే ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది. సంక్రాంతి రోజు కొమ్మ దాసరి, హరిదాసులు, నూనె గుడ్డల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దులవారు ఊర్లోకి వచ్చేవారు. వీళ్ళందరూ వారి వారి విద్యలను ప్రదర్శిస్తూ ఉంటే చాలా ఆసక్తిగా గమనించటం బాగా గుర్తు.

ఏలూరికి వెళ్లా

3మా ఊర్లో ఎనిమిదవ తరగతి పూ ర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళాను. అక్కడ మా మామయ్యగారి (చందూర్‌) ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని. ఏలూరులోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరాను. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో మేమున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ చూడడం జరిగింది. 1947లో నేను, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నాం. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నాం. 1947 చివర్లో నేను చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యాం. మద్రాసుకు వచ్చిన తరువాతే ్రపైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశాను. నేను ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియోలో నా రచనలను చదివి వినిపించేదానిని. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపాను. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ తరువాత ప్రస్తుతమున్న ఈ ఇంట్లోకి మారాము. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాం. మద్రాసులో మాకు చాలా మంది మంచి స్నేహితులున్నారు. నేను ఇప్పటికీ తరచుగా మా ఊరు వెళుతుంటాను. నేను పుట్టినప్పుడు నూజివీడులోని మా ఇంట్లో మాలతి తీగ వేశారు. ఈ తీగ ఇప్పటికీ అలాగే ఉంది.'