(వి. ఉదయలక్ష్మి)
మనం అంటే విద్యావంతులు, నాగరికులు, ప్రచార సాధనాలలో ఉండేవాళ్ళు, పాలకులు, అధికారులు- ఇంకా ఇలాంటి లక్షలమంది అని అర్థం చేసుకో వా లి. అలాకాకుండా అమాయకంగా తెలుగు భాషనే మాట్లాడుతూ దైనిక వ్యవహారానికీ వృత్తులకూ పండుగలకూ పబ్బాలకూ కళలకూ ఆ భాషే ఆధారమని భావించే సామాన్య ప్రజానీకం కోట్ల సంఖ్యలో ఉంది. వారి అచ్చమైన తెలుగుని అప భ్రంశం చేస్తూ తెలుగుకాని తెలుగును ప్రచారం చేసే మనల్ని ప్రపంచంలో ఏ భాష కు చెందినవారూ క్షమించరు. ఈ మాటల్ని మన రాజకీయ నాయకుల దగ్గరో, టీవీ యాంకర్లనబడే విచిత్ర ప్రాణుల దగ్గరో చెప్తే 'వీడొక సెంటిమెంటల్ ఫూల్' అని వాళ్ళ భాషలో తిడ్తారు. వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఆంధ్రదేశంలో కనీసం సగం మంది అమెరికాలాంటి దేశాలకు వలస వెళ్ళాల్సిన వాళ్ళు. ఆంధ్రులకు సంస్కృ త మో, ఆంగ్లమో మాతృభాషలవుతాయి కానీ తెలుగు మాత్రం కాదు. ఇంత మూర్ఖ త్వం నాకు తెలిసినంత వరకు ఏ భాషా ప్రదేశంలోనూ లేదు. మన పాలకుల్ని, అధికారుల్ని, ధనార్జన నిమిత్తమే విద్యాసంస్థల్ని నడిపే వ్యాపా రవేత్తల్ని చూస్తే మనం అసలు తెలుగువాళ్ళమే కాదేమో అని అనుమానం వస్తోంది. ప్రపంచంలో తెలుగువాళ్ళనందరినీ లెక్కకడితే దాదాపు 15 కోట్లమంది అవుతారు.
మన సంఖ్యతో పోలిస్తే ఎన్నో యూరోపియన్ భాషలు చాలా తక్కువ సంఖ్య మాట్లా డేవారిని కలిగి ఉన్నాయి. కానీ వాటికుండే మర్యాద మనకేదీ? మనల్ని మనమే కించ పరుచుకుంటూ ఉంటే మర్యాద ఎక్కడినుంచి వస్తుంది? భావుకతతో కాకుండా ప్రయోజనాత్మకంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచిద్దాం. ఇన్ని కోట్ల మంది ఉండే ఏ దేశంలోనైనా సాహిత్యం చరిత్ర, విజ్ఞానం, పరిపాలన అదే భాషలో ఉంటాయి. నొబెల్ బహుమతి పొందిన వారిలో అధికశాతం ఇంగ్లీషు లో రాసిన వారు కారు. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, జపనీస్, చైనీస్లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం వ్యక్తమవుతున్నప్పుడు తెలుగు మాత్రం పనికిమాలిన భాష అవుతుందా? దయచేసి విద్యావంతులంతా ఆలోచించండి. పై భాషల్లో వెలువడిన గొప్ప గ్రంథాలను ఇంగ్లీషులోకి, ఇతర భాషల్లోకి అనువదించు కుంటారు. అంతేకాని వాళ్ళంతా వచ్చీరాని ఇంగ్లీషులోనే రాయాలనుకోరు. మన భాషని ఆ స్థాయికి తీసుకువెళ్ళాలన్నది మన ప్రయత్నం కావాలి.
కానీ మన భాషనే అధోగతికి దిగజార్చేది ఏ రకం సంస్కృతి? తెలుగువాళ్ళు చదివేది తెలుగు వాళ్ళకు ఉపయోగపడాలి కాని అమెరికా వాళ్ళకో, బ్రిటన్ వాళ్ళకో ఉపయోగపడాలనుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాక సామాజిక ద్రోహం కూడా. ఇంజనీరింగ్కాని, వైద్యశాస్త్రంకాని చదవాలనుకోవడం మరో దేశ ప్రజలకు సేవ చేయడానికా? వీళ్ళ చదువులకయ్యే ఖర్చుల్లో ఎక్కువ శాతం భరిస్తు న్నది తెలుగు ప్రజలే. అందువల్ల సాంకేతిక విద్యలతో సహా అన్ని రకాల విద్యలూ తెలుగులో జరిగేటట్లు చూడడం తెలుగువారి కర్తవ్యం. ఇలా రాయడం వల్ల నేను ఇంగ్లీషు భాషా వ్యతిరేకినని కాని, తెలుగువారు ఇంగ్లీ షు చదవకూడదని కానీ అర్థం చేసుకోరాదు. ఇంగ్లీషు నేర్చుకోవడం అవసరాన్ని బట్టి కావాల్సిందే, దానిలో ఎంత పరిణత చెందినా మంచిదే. కావాలంటే మొదటి తరగతి నుంచే మంచి ఇంగ్లీషు నేర్పించండి. అయితే తెలుగుకు మొదటిస్థానం ఇవ్వండి. అన్ని రంగాలలోను తెలుగువాళ్ళు తెలుగు ద్వారా మహోన్నత స్థానానికి వెళ్ళే అవ కాశాన్ని కల్పించండి. ఇలా గుణాత్మకంగా ఆలోచించగలిగిన వారే కరువయ్యారా? ఈ సందర్భంగా దయచేసి మన అధికారులు, పాలకులు, రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఉస్మాని యా విశ్వవిద్యాలయం ప్రారంభమైన నాటినుండి చాలా ఏళ్ళ వరకు బోధనా, పరి శోధనా అంతా ఉర్దూలో జరిగేది. అంతేకాదు జ్ఞానపీఠానికి కూడా ఎదిగిన మన సినారె, దాశరథిలాంటి ఎంతోమంది ఉర్దూలో చదువుకున్నారు. అప్పట్లో నైజాం పరి పాలనలో ఉర్దూ అధికార భాష. మరి ఉర్దూకు ఆ స్థానం వీలయినప్పుడు తెలుగుకు ఆ స్థానం పొందే యోగ్యత లేదా? మరో ఉదాహరణ చిత్తగించండి. బ్రిటిషు పరి పాలనలో దేశమంతా ఇంగ్లీషు మయంగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత హిందీని అధికార భాషగా చేశారు.
మెల్లగా హిందీని దేశమంతటా ఇష్టమున్నా లేకున్నా రుద్దారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏ పరీక్షలు రాయాలన్నా (ఐఎఎస్ లాంటివి, యుజిసి పరీక్షలు, యుపి ఎస్సి పరీక్షలు) ఇంగ్లీషుతోబాటు హిందీలో కూ డా రాయవచ్చు. నిజానికి హిందీ ఉత్తర భారతదేశంలో అందరికీ మాతృభాష కాదు. అలాంటప్పుడు హిందీతోబాటు తెలుగువారికి కూడా అలాంటి అవకాశం కలి గించాలని ఈ పాలకులు పోరాడాల్సింది. కాని హిందీని, తెలుగును వదిలి ఇంగ్లీషునే ఆశ్రయించడం మన తెలివిమాలిన తనాన్ని సూచిస్తోంది. ఈ విషయంలో తమిళనా డు, కర్నాటక ప్రభుత్వాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. హిందీని తమిళంమీద రుద్దాల నుకున్నప్పుడు తమిళ ప్రజలు ఉవ్వెత్తున లేచిపడ్డారు. కాంగ్రెస్కు దిమ్మతిరిగేట్టు చేశారు. అప్పట్లో భక్తవత్సలం గారు దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత వచ్చిన అణ్ణాదురై, కరుణానిధి, ఎంజిఆర్, జయలలిత- వీళ్ళెవ్వరూ పదహారణాల అరవవా ళ్లుకారు. అయినా వాళ్ళు తమిళమంత్రం జపించకుంటే తమిళనాడులో వాళ్ళకు పుట్ట గతులుండవ్. తమిళానికి ప్రథమ స్థానిమిచ్చి, దానితోబాటు ఇంగ్లీషునూ నేర్పిస్తూ తమిళులు జాతీయస్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలుగు తున్నారు. కర్నాటకలో కన్నడానికే ప్రథమ స్థానం, మన రాష్ట్రంలో తెలుగు వాళ్ళంతా సంస్కృతం చదువుతారంటే కన్నడిగలు మనసారా నవ్వుతుంటారు.
అక్కడ 'కన్నడ మరియు సంస్కృతి' ఇలా భాష ఉంది. అక్కడి అధికార భాషా సంఘం వారు కన్నడ అమలు చేయని చోట్ల నానా రాద్ధాంతం చేస్తా రు. పత్రికలలో దుమ్మెత్తి పోస్తారు. అక్కడి ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం కులపతి (మన బాల వీరారెడ్డిగారే) ఇంజనీరింగ్ విద్యనుకూడా కన్నడ మాధ్యమంలోనూ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తు న్నారు. అక్కడి ప్రభుత్వం వివిధ రంగాలలో కృషిచేసిన ఏడెనిమిది మందికి లక్ష రూపాయల వంతున పురస్కారాలిస్తుంది. అక్కడి ప్రతి ఏడాది కన్నడ సాహిత్య పరి షత్తు జరిపే సమయంలో ఆ జాతీయ సమ్మేళనా ధ్యక్షుణ్ణి ఆయా పట్టణాలలో గౌరవంగా ఊరేగిస్తారు. ముఖ్యమంత్రి విధిగా ఆ ఉత్సవాలకు హాజరవుతారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. తమ భాషను తాము ప్రేమించ లేనివాళ్ళు పుట్టకురుపులాంటివాళ్ళు. వాళ్ళూ బాగుపడ రు. సమాజాన్నీ బాగుపరచరు. భాష సర్వతోముఖాభివృద్ధికి ఉపకరించని ఇలాంటి వాళ్ళ వల్ల భాషకే కాదు ఏ సమాజానికీ ఉపయోగం లేదు.