'పుళుమావి'లో తెలుగు జాడ! /


(పరిమి రామనరసింహం)

అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలక మీద కనిపించిన 'నాగబు' అనే మాటను తెలుగు ప్రాచీనతను గురించి చెప్పటానికి ఉట్టంకిస్తూ ఉంటారు. పగిలిన ఆ రాతి పల క మీద ఉన్నది నాగబు అన్న ఒకే ఒక మాట. ఇది పూర్తిగా తెలుగు మాట కాదనీ, నాగ అనే సంస్క­ృత ప్రాతిపదిక మీద 'బు' అనే తెలుగు ప్రత్యయం చేరగా ఏర్పడి నది అని కూడా చెప్తారు. నాగబును తెలుగు పదం అని మొదటిసారిగా గుర్తించినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి. అయితే దీన్ని పురాతత్వవేత్తలు సమర్థించరు. అమరావతిలో దొరికిన శాసనాల లో చాలాచోట్ల 'నాగబుధనికా' 'నాగబుధనో' వంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాట తో దొరికినది ఒక రాతి ముక్క అని, అది 'నాగబుధనో' లేదా ' నాగబుధనికా' వంటి మాట కల శాసన శిల పగిలిపోగా 'నాగబు' అన్న భాగం మాత్రమే ఉన్న ముక్క మనకు లభించి ఉండవచ్చ నీ వారు అంటారు. అయితే వేటూరి వారి అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపారవేయలేము. ఎందు కంటే నివబు (నెపం), వక్రబు, పట్టణబు వంటి మాటలు మనకు 575 నించి దొరుకుతున్న తెలు గు శాసనాలలో కనిపిస్తూనే ఉన్నాయి. కనుక బు-ప్రత్యయం కల పదాలు ఆనాడు వాడుకలో ఉండేవి అనటానికి ఇవి సాక్ష్యం అవుతై. అందువల్ల నాగబు తెలుగు మాట కాదు అనలేము.

ఇంతకంటె బలమైన సాక్ష్యం శాతవాహనుల కాలం నాటి సంస్క­ృత ప్రాకృత శాసనాలలో కనిపించే ఊళ్ళ పేర్లు. ఖడవలి (కొడవలి), వేపూరకే, కెవురూరే, హిరలూరే-మొదలైనవి. అట్లాగే హాలుని (క్రీ.శ. 1వ శతాబ్ది) గాథాసప్తశతిలో తెలుగు పదాలుగా గుర్తించదగిన అత్తా, అద్దాయే (అద్దం) వంటి పదాలు. వీటిని కూడా ఆంధ్రభాషా ప్రాచీనతను నిరూపించటానికి ఉట్టంకిస్తూనే ఉంటారు. వీటికంటె బలవత్తర మైన సాక్ష్యం శాతవాహన రాజులలో నలుగురికి పేరుగా కని పించే 'పుళుమావి' పదం. ఇది తెలుగు పదం. 'పుళు' (పులు) శబ్దానికి గడ్డి (రెల్లు గడ్డి) అని అర్థం. సుమతీ శతకంలో కూడా ఈ పదం మనకు కనిపిస్తుంది ('నలువురు నడచెడి త్రోవల పులు మొలవదు; మొలిచెనేని పొలియదు సుమతీ'). మావి అంటే తల్లి పేగు. పశువులు ఈనిన ప్పుడు వెలువడే తల్లిపేగును మాయి అంటారు. దీనికి పూర్వ రూపం మావి. ( 'బావి' 'బాయి' అయినట్లే మావి మాయి అయింది. ఈ పద స్వరూపం, అర్థం తెలియక దీన్ని 'మాయ' అని కూడా అంటారు.) (రెల్లు) గడ్డి తల్లిపేగుగా కలవాడు అని అర్థం. అంటే కార్తికే యుడు (కుమారస్వామి) అన్నమాట. శరవణభవుడు ( = రెల్లుగడ్డిలో పుట్టినవాడు) అన్న సంస్క­ృత సమాసానికి మంచి తెలుగు మాట ఇది. ఒక రాజు తన కుమారుని పేరుగా ఒక తెలుగు పదాన్ని వాడాడు అంటే తెలుగు ప్రజ ల్లో ఎంతగా పాతుకుపోయి ఉందో గ్రహించవచ్చు. ఈ పదం మొదటి పుళుమావి కాలాని (క్రీస్తుపూర్వం 40)కే ప్రజల్లో బాగా వ్యాప్తిలో ఉంది అని ఇది రుజువు చేస్తున్నది. (దీన్ని నేను హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎమ్. ఏ. విద్యార్థులకు తెలు గు భాషావికాస చరిత్రలో ఒక అంశంగా 1985 నుంచి చెప్తున్నాను. )

పుళుమావి నాణేల మీది వాక్యాలు కూడా తెలుగు ప్రాచీనతకు గట్టి సాక్ష్యాలని చెప్పవచ్చే. అవి: (అ) ప్రాకృతం- రజ్ఞో వాసిఠీ పుతస సరి పులుమావిస; (ఆ) దేశి- అరహణకు వాహిట్టి మాకనకు తిరు పుళుమావికు. ప్రాకృతంలోని 'రజ్ఞో', 'పుతస', 'పులుమావిస' అనేవి 'యొక్క' అనే అర్థం ఇచ్చే షష్ఠీ విభక్తి రూపాలు. రాజుగారైన వాసిష్టీ పుత్రుడు శ్రీ పులుమావి యొక్క (నాణేలు) అని ప్రాకృత వాక్య భావం. రాజ్ఞః వాసిష్ఠీ పుత్రస్య శ్రీ పుళుమావిస్య (?) అని దీనికి సంస్క­ృత చ్ఛాయ. దేశి వాక్యానికి 'రాజు, వాసిష్ఠి కొడుకు అయిన శ్రీ పులుమావికి (చెందినవి)' అని చెప్పుకోవాలి. ఈ 'అరహణకు వాహిట్టి మాకనకు (మకనకు) తిరు పుళుమావికు' అనే వాక్యం తమిళులు కూడా తమదే అని వాదిస్తారు. 'అరసన్' (రాజు), 'మకన్' (కొడుకు), 'తిరు' (శీ) అనేవి ఈనాటికీ తమిళంలో వాడుకలో ఉండటం అందుకు కారణంగా చూపిస్తారు. ద్రావిడ భాషలలో రలలు పదాదిన రావు. అందువల్ల ( ఆరుద్ర వాదం ప్రకారం) రథ శబ్దం అరదం అయినట్లే రాజన్ శబ్దం అరసన్ అవుతుంది. ఇది నేడు తమిళంలోనూ, కన్నడంలో కూడానూ వాడుకలో ఉన్న మాట వాస్తవమే. (కర్ణాటకలో దేవరాజ అర్స్ అన్న పేరు మనం ఎరిగినదే.) అయితే ఈ లక్షణం కన్నడ తమిళాలకేమీ సొంతంకాదు. ద్రావిడ భాషల ఉమ్మడి లక్షణం ఇది. తిమ్మరసు, కొండమరసు తెలుగువాళ్ళే. అయితే ఈ పేర్లకు కన్నడ స్పర్శ ఉంది అనే సందేహంతో తెలుగు వాదాన్ని తోసిపుచ్చారు తమిళవాదులు. కాని ముదిరాజు, ముత్తరాసు, ముత్తరాచు, ముతరాచు అనే కులనామాలు స్పష్టంగా దీని తెలుగుతనాన్ని నిరూపిస్తున్నాయి. ఎట్లాగంటే, రాచ శబ్దం సమాసాలలో నిలిచినా, వ్యస్తంగా వచ్చేసరికి ' అరచ' అని ఉండటం తెలుగు యొక్క ద్రావిడ లక్షణానికి అనుగుణమైన పరిణామమే కనుక. అంటే, సంస్క­ృతంలోని రాజన్ శబ్దం తెలుగులోకి నేరుగా వచ్చిన పదమనీ, అది సమాసాలలో రాచ శబ్దం గానూ, వ్యస్తంగా ద్రావిడ లక్షణాన్ని బట్టి 'అరచ' శబ్దంగానూ వచ్చినదే కాని, తమిళం లోనించి వచ్చినదో లేక తమిళ పద మో కానక్కర లేదు అని గ్రహించాలి. 'అరహణకు' అనే దాన్ని అరచనకు అని చదివే అవకాశం కూడా దీన్ని బలపరుస్తుంది. ఈ నాణేల మీది దేశి వాక్యాన్ని తమిళం అనేవారు తమ అభిప్రా యానికి అనుకూలంగా చేసే వాదాలలో ఆ కాలంలో తెలుగు ఉన్నట్లు ఆధారాలు లేవు అనేది ఒకటి. ఇది సరైన వాదం కాదు. సంస్క­ృత ప్రాకృత భాషా ప్రాబల్యం దక్షిణానికి పోయిన కొద్దీ తగ్గుతుంది కనుక ఇతర భాషల ఉనికిని తెలిపే ఆధారాలు దక్షిణానికి పోయిన కొద్దీ బలీయ మైనవి ఉంటై. తెలుగు నాట మాటలు మాత్రమే కనిపిస్తూ ఉన్న కాలంలో తమిళంలో వాక్యాలు (శాసనాలు) దొరుకుతూ ఉండవచ్చు. మాటలు మాత్రమే కనిపించినై అని భాష లేదు అనటం సమంసజం కాదు. మరొక ముఖ్యమైన అంశం లేఖన సంప్రదాయానికి చెందినది. తమిళంలో రెండు హల్లులను కలిపి రాసేటప్పుడు మొదటిదానిమీద ఒక చుక్క పెడతారు. క్క రాయాలంటే మొదటి క మీద చుక్క పెట్టి దాని పక్కన మరొక క రాస్తారు. ఈ చుక్కను తమిళంలో పుళ్ళి అంటారు. ఈ సంప్రదాయం దక్షిణాది భాషలలో ఎందులోనూలేదని, తమిళంలో మాత్రమే ఉం దనీ, ఈ నాణేల మీది వాచిట్టి అనేమాటలోని ట్టి ఇట్లాగే (మొదటి ట మీది చుక్క తర్వాత టి) రాయటం కనిపిస్తున్నదని, కనుక ఈ వాక్యం తమిళం అనీ వారి వాదం. ఈ వాదంలో ఉన్న దోషం భాషకూ లిపికీ మధ్య భేదాన్ని గుర్తించకపోవటం. లేఖన సంప్రదాయం వేరు; భాషణ పద్ధతి లేదా భాష పద్ధతి వేరు. ఏ భాషను ఏ లిపిలోనైనా రాయవచ్చు. అయితే అసలు సమా ధానం ఇదికాదు. శాతవాహనుల శాసనాలలోని బ్రాహ్మీ లిపి ఆంధ్ర దేశ సంప్రదాయానికి చెందినిది. దీన్ని 'ఆంధ్రీ' అనికూడా అనేవారు. నేటి తెలుగు లిపి దీనికి కొనసాగింపు కాదు. 5వ శతాబ్ది ప్రాంతంలో దక్షిణ దేశంలోని బ్రాహ్మీ లిపికి చెందిన మరొక శాఖ నుంచి ఏర్పడిన చాళుక్య లిపి నుంచి నేటి కన్నడ-తెలుగు లిపులు ఏర్పడినై. పైన పేర్కొన్న ఆంధ్రీ లిపి తెలుగు నాట కొన సాగలేదు. బహుశ బౌద్ధ-శైవ వివాదాలలో ఇది కూడా ఒక భాగం అయి ఉండవచ్చు. దీనివల్ల ఈ కాలంలో తెలుగు భాషకు కూడ ఆ నష్టం జరిగి ఉండవచ్చు. ఆంధ్రీ లిపి, తమిళనాట కూడా వ్యాపించి నేటి తమిళ లిపికి మూలం అయింది. తమిళ పండితులు దీన్నే సొంతం చేసుకొని తమి ళ బ్రాహ్మీ అంటున్నారు. కనుక హల్లులను కలిపి రాసేటప్పుడు మొదటి హల్లుకు చుక్క పెట్టే సం ప్రదాయం ఆంధ్రదేశంలో కొనసాగలేదు. హల్లు కింద హల్లు (ఒత్తులు) రాసే ప్రాచీన బ్రాహ్మీ సంప్రదాయమే కొనసాగింది. కాని ఈ 'పుళ్ళి' తెలుగులో లేకపోలేదు. అచ్చు (గుణింతం)లేకుండా కేవలం హల్లును రాయటానికి తెలుగులో 'పొల్లు' రాస్తాం. దాన్నే తమిళంలో 'పుళ్ళి' అంటారు. రాసే విధానంలో తేడా ఉన్నా రెండు మాటలకూ మూలం ఒకటే.

భాషా పరమైన ఈ కారణాల వల్ల దేశి భాషకు చెందిన వాక్యం అని పరిశీలకులు భావిస్తున్న 'అరసనకు వాసిట్టి మాకనకు (మకనకు) తిరు పుళుమావికు' అన్న ఈ వాక్యం అచ్చంగా తెలుగు వాక్యమే అని చెప్పగలుగుతాం. పై చర్చ ద్వారా మనం ఈ కింది అంశాలు గ్రహించవచ్చు. సంస్క­ృత ప్రాకృత భాషలు బాగా వాడుకలో ఉండగా ఒక ప్రసిద్ధ రాజవంశం లోని రాజు పేరు తెలుగులో ఉన్నది. ఈ రాజవంశంవారి నాణేల మీద ఒక పక్కన ప్రాకృతంలో నూ మరొక పక్క తెలుగులోనూ రాయబడి ఉన్నది. తెలుగువారైన శాతవాహన ప్రభువులు రాజ కీయ, సాంస్క­ృతిక, సామాజికమైన ఒత్తిళ్ళు కారణంగా ప్రాకృత భాషను అలవరచుకొని అందు లోనే అధికార వ్యవహారాన్ని నెరపుతున్న వారైనప్పటికి తెలుగు పట్ల కొంత సానుకూల స్పందన కలవారేనని చెప్పాలి. అట్లాకాక వారిది వేరేభాష అయివుంటే పాలితుల భాషలో తమ పేరు పెట్టుకోవవటం అనేది సందేహించదగిన అంశమే. బలమైన ప్రజా వ్యవహారం లేకుండా (అ) దేశంలోని ఊళ్ళ పేర్లు ఆ భాషలో ఎందుకు ఏర్పడతై?; (ఆ) 'మహాతలవరి' (వీరపురుషదత్తుని నాగార్జునకొండ శాసనం, క్రీ.శ. 239), 'మహా తగవరి' (కొండముడి జయవర్మ శాసనం క్రీ.శ. 270) వంటి పదవులపేర్లు (తలవరి= నాయకుడు; తగవరి= తీర్పరి, జడ్జి) ఆ భాషలో ఎందుకు ఉంటై? (తలవరితర్వాత తలారిఅయింది. ఇది అచ్చ తెలుగుపదం. దీన్ని తమిళ పదంగా భ్రమిం చకూడదు. తమిళంలో తలైవర్ అని ఉంటుంది); (ఇ) ఒక రాజవంశం తమ నాణేలను ఒకానొక భాషలో ఎందుకు ముద్రిస్తుంది? ఈ భాషకు తెలుగు అనేపేరుకూడా చాలా ప్రాచీనమే. ముందు జాతిపరంగా, తరువాత దేశ పరంగా ఆ తరువాత భాషా పరంగానూ ఏర్పడ్డ ఈ పేరు క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్ది నాటిది అని బి.యస్.యల్. హనుమంతరావు రాశారు. బౌద్ధం గురించి ఒక మాట చెప్పాలి. బౌద్ధం ప్రాకృతాన్నే ఆదరించింది. సర్వసాధారణంగా పరిశోధకులు బౌద్ధం ప్రజల భాషను ప్రోత్సహించింది అంటారు. నిజానికి బౌద్ధం ప్రోత్సహించింది పూర్తిగా ప్రజల భాషను కాదు; ప్రాకృతాన్ని. ప్రాకృతం ప్రజల భాష కాని చోట అది దేశి భాషలను ప్రోత్సహించ లేదు. జైనం కొంత, వైదికం మరింత ఆ పనిచేసినై. తొలినాటి తమిళ సాహిత్యం జైన స్పర్శ కలది. కన్నడంలోకూడా. దవిడ దేశంలో ఆర్యీకరణం జరిగిన తర్వాత కూడా తమిళం పరిఢవిల్లింది. ఆంధ్రదేశం బౌద్ధ ప్రాబల్యంవల్ల భాషాపరంగా నష్టపోయింది. తెలుగు భాష ప్రాకృతపు పట్టు నుంచి బయటపడటానికి శతాబ్దాలు పట్టింది. అంతేకాని తెలుగు లేకపోలేదు.