తత్వార్థాలకు తేటతెలుగు వెలుగు Telugu/Home


(మంగు శివరామప్రసాద్‌)
మే 30 తరిగొండ వేంకమాంబ జయంతి

కవికి ఎన్నో శాస్త్రాలతో పరిచయం ఉండాలనీ, ఎన్నో విద్యలను కవులు అభ్యసించాలని, ఎంతో ప్రాచీనసాహిత్యం చదవాలని, శబ్దజాలం పుష్కలంగా తెలియాలనే అభిప్రాయం బలంగా ఉన్న కాలంలో, అవన్నీ తెలియకనే, కవిత్వం వ్రాశామన్నవారిలో తరిగొండ వేంకమాంబ మంచి విద్వాంసురాలు. అత్యంతకళాత్మకమైన సృజనాత్మకమైన కవితాప్రక్రియలో మిణుగురు పురుగుకూ స్థానముంది. మిరుమిట్లు గొలిపే ధ్రువతారకూ స్థానముంది. దేని స్థానం దానిదే అని తమ కావ్యకృతులలో నిరూపించింది, ఈ విదుషీమణి.

సాహిత్యంలో మెలకువలు, రహస్యాలు తెలియకనే, అలంకార వ్యాకరణాదిశాస్త్రాలు చదవకనే, కేవలం తన ఇష్టదైవం తరిగొండ నృసింహస్వామి దయ వల్లనే తనకు కవిత్వం చెప్పడం వచ్చిందని, తన కృతి వేంకటాచలమాహాత్మ్యం అవతారికలో వేంకమాంబ ఇలా అన్నది.

''నా చిననాట నోనామాలు నైన నా
చార్యుల చెంతనే జదువలేదు
పరుగు ఛందస్సులో బది బద్యములనైన
నిక్కంబుగా నేను నేరలేదు
లలికావ్యనాటకాలంకారశాస్త్రము
ల్వీనులనైనను వినగలేదు
పూర్వేతిహాస విస్ఫురితాంధ్రసత్కృతు
ల్శోధించి వరుసగ జూడలేదు
చేరి తరికుండపురి నారసింహదేవు
డాన తిచ్చిన రీతిగ నే నిమిత్త
మాత్రమున బల్కుదును స్వసామర్థ్యమివ్వ
దరయ నించుక యేని నా యందు లేదు.''

కావ్యరచనలో పూర్వకవులు తొక్కని దారి లేదు. చెప్పని భావాలు లేవు కదా. నువ్వు కొత్తగా చెప్పేదేముందని ఇప్పుడు కావ్యం రచించావు? ప్రాచీనుల కన్న నీ గొప్పతనం ఏమిటి? అనేప్రశ్నకు, తల్లితండ్రులకు, చిన్నపిల్లల జిలిబిలి పలుకులు ముద్దుగొల్పుతూ ఉంటాయని తరిగొండ వేంకమాంబ పండితులను, ప్రజలను ఇలా వేడుకుని, తన కావ్యాన్ని రుచి చూపింది.

''పండితాగ్రగణ్యులార ప్రజలారా నా
బాలభాష కసూయపడక వినుడు
తల్లిదండ్రులు చిన్నపిల్లల పల్కుల
కానంద మొందెడునట్టు యిందు
మీరు నా తప్పొప్పు లేరీతిగానైన
గేలి సేయక చిత్తగింపవలయు
నాంధ్రగీర్వాణ మహాకృతులుండగా
నిప్పుడీ కృతి వినవేల యనగ
భక్ష్యములు మెక్కి యావల బచ్చడియును
నంజుకొనిన విధంబున నా ప్రబంధ
మాలకింతు రటంచు బేరాస చేత
నేను రచియింతు దాని మన్నించి గనుడు.''

పండితులను, ప్రజలను, తన కావ్యాలను స్థాలీపులాకన్యాయంగా స్వీకరించి తనని ఉద్ధరించమని వేడుకొనడంలో, వెంకమాంబ వినయశీలం స్పష్టమవుతూంది. రచన తర్వాత లక్షణం పుడుతుంది. కవి సమాజజీవి. శాస్త్రాలన్నీ సమాజజీవితం నుంచే పుడతాయి. శాస్త్రాన్ని అభ్యసించకపోయినా జీవితానుభవం ఉంటుంది కాబట్టి శాస్త్రవిషయాలు, అనుభవవిషయాలు సహజంగానే రచనలో చోటు చేసుకుంటాయి.

''పలికించెడివాడు రామభద్రుండట'' అన్న పోతన మాటననుసరించి, వినయశీలురైన కవులు, కవయిత్రులు, ఇలా తమ అభిప్రాయాలను వెలిబుచ్చడంలో వింత ఏమీ లేదు.

తరిగొండ వేంకమాంబ వేంకటాచలమాహాత్మ్యం, జ్ఞానవాసిష్ఠ రామాయణం, రాజయోగగ్రంథాలను రచించి, తరిగొండ నృసింహస్వామికి అంకితమిచ్చింది. వైరాగ్యప్రభావంతో, ఆత్మానాత్మవివేకాన్ని తెలిపే కథలు ఎన్నో, జ్ఞానవాసిష్ఠము ద్విపద కావ్యంలో ఆమె పొందుపరిచింది. గూఢవేదాంతవిషయాలను కూడా వేంకమాంబ మృదుమధురంగా స్పష్టంగా వివరించింది. రాజయోగం కూడా ద్విపదకావ్యమే. ఇందులో రాజయోగవిశేషాలు చక్కగా వివరించబడ్డాయి.

నరసింహశతకం, నరసింహవిలాసకథ, శివనాటకం, రాజయోగసారం, కృష్ణనాటకం, పారిజాతాపహరణం, రమాపరిణయం చెంచు నాటకం, శ్రీకృష్ణమంజరి, రుక్మిణి నాటకం, గోపి నాటకం రచించి, తరిగొండ నృసింహస్వామికి అంకితమిచ్చింది. వాసిష్ఠ రామాయణం అనే వేదాంతగ్రంథం కూడా, భాగవతకథ ఆధారంగానే రచించింది ఈమె. కృష్ణమంజరి ద్విపద శతకం వంటిది. శివపారిజాతంగా పేరు గాంచిన శివవిలాసం ఒక యక్షగానప్రక్రియ.

వేంకమాంబ గంభీరమైన యోగరహస్యాలను, సరళసుందరమైన భావమధురమైన శైలిలో వివరించింది. లలితమైన శృంగార భావనలను కూడా రమణీయశైలిలో చెప్పింది. యోగతత్వ విషయాలను ఎంతో విజ్ఞానప్రదంగా చెప్పింది. ప్రణయకోపాలను, సవతి మాత్సర్యాలను, నర్మగర్భసంభాషణలను, స్త్రీల ఎత్తిపొడుపు మాటలను, శ్రీకృష్ణుని శృంగారలీలలను, సహజంగా, రసవత్తరంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసంతో మధురభక్తి కాక, జ్ఞానాత్మకమైన యోగభక్తితో, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ రచనలు చేసింది. ఈమె పాడుకోడానికి వీలైన సింగారపు పాటలు, నలుగు పాటలు, ఆరగింపు పాటలు, నిద్ర పుచ్చే పాటలు, మంగళహారతి పాటలు వ్రాసి, తన రచనలను సంగీతసాహిత్యసమ్మేళనాలుగా రూపొందించింది.

తరికొండ వేంకమాంబ రచించిన శ్రీకృష్ణమంజరి చాలా ప్రశస్తమైన స్తుతికావ్యం. దీనిని వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు)గారు, తమ భక్తిసంజీవని అనే పత్రికలో జనవరి 1929 సంచికలో ప్రచురిస్తూ, ఈమెను మహాయోగిని, భక్తురాలు, కవయిత్రిగా పేర్కొన్నారు.

''శ్రీ వెంకటేశ! నా చిత్తంబు నందు
నీ పాదయుగళంబు నిల్పవే కృష్ణ
నన్నేల తరిగొండ నరహరాకృతిని
బ్రత్యక్షమై నన్ను బాలింపు కృష్ణ!''

అని ఈ స్తుతిమంజరి కావ్యం మొదలై చివరలో ఈమె తల్లిదండ్రులు కానాల మంగమాంబ, కృష్ణయామాత్యుడు అని చెప్పడం జరుగుతుంది.

సంస్కృత వరాహ, భవిష్యోత్తర, పద్మపురాణాలలోని వేంకటాచల మహాత్యం ప్రశంసలు ఆధారంగా, వేంకమాంబ, 'వేంకటాచల మాహాత్మ్యం' రచించింది. దీనిలో పద్మావతీశ్రీనివాసుల వివాహ వృత్తాంతాన్ని ఎంతో రమణీయంగా రూపొందించింది. .స్త్రీ హృదయాంతరాళాలలోని సున్నితభావాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మగోపనాన్ని వేంకమాంబ అత్యంతమార్దవంగా, మార్మికతతో, చాకచక్యంతో, సరసంగా చిత్రించింది. శ్రీనివాసుని ద్వితీయవివాహసందర్భంలో లక్ష్మీదేవి అనుభవించిన బాధను ఆమె సమర్థంగా వర్ణించింది. ఇది వెంకటగిరి క్షేత్రమహాత్యం వర్ణించే కావ్యం.

వేంకమాంబ తాను భాగవతం ద్వాదశస్కంధాలను ద్విపదకావ్యాలుగా రచించినట్టు, వేంకటాచలమాహాత్మ్యంలోని ఒక పదంలో చెప్పుకొంది.

ఈ ద్విపద భాగవతంలో, తత్వార్థాలను పామరులకు కూడా సరళసుబోధకం చేయడానికి, వేంకమాంబ తేటతెలుగు పదాలను ప్రయోగించి సంక్షిప్తసుందరం గావించినట్టు, ఈ ద్విపద పంక్తుల ను బట్టి తెలుస్తున్నది.

వేశ్యాంగన ముద్దుపళని వ్రాసిన రాధికాసాంత్వనము అనే శృంగారప్రబంధంలో వలె, మితిమీరిన శృంగారవర్ణనలు చేయక, కులాంగన అయిన వేంకమాంబ శృంగారం పేర అసభ్యవర్ణనలు చేయలేనని వేంకటేశ్వరమాహాత్మ్యంలో శ్రీకృష్ణునికి, అనగా కలియుగప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి ఇలా విన్నవించుకోవడం సమంజసంగానే ఉంది.

''శృంగారాకృతి తోడ పచ్చి పదముల్‌ శృంగారసారంబు తో
డం గూఢంబుగ జెప్పు నీవనగ నట్లే చెప్పలేనన్న నన్‌
ముంగోపంబున జూచి లేచి యటనే మ్రొక్కంగ మన్నించి
తచ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీకృష్ణుని సేవించెదన్‌.''

వేంకమాంబ తన కావ్యంలో పచ్చి శృంగారవర్ణనలు చేయలేదు సరి కదా, అక్కడక్కడ సందర్భోచితంగా వెలువడిన శృంగార పద్యాలు కూడా కృతిపతి శ్రీకృష్ణుని చమత్కారాలే అని లోకానికి చెప్పినట్టు తెలిస్తున్నది.

ఎరుకసాని పాత్రను వేంకటాచలమాహాత్మ్యం కావ్యంలో ప్రవేశపెట్టి పాత్రోచితభాషగా సోదిభాషను ప్రయోగించి, నాటకీయతను, రమణీయతను కలిగించింది వేంకమాంబ

''అవ్వోయవ్వ నీ తలంచిన తలంపు మేలవుతాదంట. దేవుళ్లు పలుకుసుండారు. తలచిన తలపేమంటివా, సెప్పెద విను దయితమ్మ! ఆ నల్లనయ్య యే దిక్కు నుండి వచ్చినాడంటావా? తల్లి ఇదిగో ఈ మూల నుండి వచ్చాడే....''

తరిగొండ వేంకమాంబ శైలి, వేదాంతవిషయవివరణ సందర్భంలో కూడా మధురమై, వ్యావహారికానికి సన్నిహితమై ఉండటం విశేషం. ఆమె రచనలు ఆత్మజ్ఞానానికి, ఔచిత్యానికి ఆటపట్టు. ఈమె నిర్గుణోపాసన నుంచి, సగుణోపాసులోకి దిగి మధురభక్తి సంప్రదాయాన్ని గురించి ప్రబోధాత్మకమైన, భక్తిదాయకమైన, రసోప్లావితమైన, అధ్యాత్మికచింతనాభరితమైన కమనీయకావ్యాలను రమణీయంగా రచించి, ఆంధ్రపాఠకలోకానికి అందించింది.

'ఆంధ్రవిదుషీమణులు' గ్రంథరచయిత ప్రముఖపాత్రికేయుడు కీ.శే. ఆండ్ర శేషగిరిరావు గారు, ఆమె శైలి కడు మృదువుగను హృదయంగమముగను ఉండును. సంభాషణశైలికి వీలైనంత దగ్గరగా రాసినది. భావమార్దవము నందు భక్తివైరాగ్యములందు వేంకమాంబ మన ప్రాచీనకవులకు తీసిపోని ఉత్తమకవయిత్రి అన్నారు. సి.పి బ్రౌన్‌ దొరగారు తన నిఘంటువులో ఈమెక్రీ.శ 1840కి చెందినవారని ఉటంకించారని, కందుకూరి వీరేశలింగంగారు, తన కవుల చరిత్రలో తెలిపారు. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తురాలు అయిన ఈమె తిరుపతిలోనే చాలా కాలం జీవించింది.