మన దేశపు తొలి లిపి Telugu/Home


(రోహిణీ ప్రసాద్)

మన దేశంలో మొదటగా తలెత్తిన నాగరికత సింధునది ప్రాంతంలో మొదలైనట్టుగా వింటాం. దాదాపు రెండు లక్షల సంవత్సరాల క్రితం పుట్టుకొచ్చిన ఆధునిక మానవజాతి ప్రజలు కనీసం లక్ష సంవత్సరాల క్రితమే ఆఫ్రికానుంచి ఆసియా, మొదలైన తక్కిన ప్రాంతాలకు వలసవెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరంతా సింధునది సమీపంలోనే కాక మన దేశమంతటా స్థిరపడ్డారు. అయినప్పటికీ సింధు నాగరికత ఎంతో విశిష్టమైనది. అక్కడ నిర్మించబడ్డ గొప్ప నగరాలూ, వీధుల రూపకల్పనా, తాగునీటికీ, మురుగు నీటికీ అద్భుతమైన ఏర్పాట్లూ వగైరాలకు సాటి రాగల సమకాలీన నాగరికతలేవీ కనబడవు. నేటి పాకిస్తాన్‌లో 1920లో జరిపిన మొహెంజోదడో, హడప్పా ప్రాంతాల్లో తొలి తవ్వకాలలో బైటపడ్డ అపూర్వమైన విశేశాలు సంచలనం కలిగించాయి. క్రీ.పూ. 2600-1900 మధ్యలో ఉచ్చదశకు చేరుకున్న ఈ నాగరికతలో లిపిని గురించిన ఆధారాలు కూడా దొరికాయి.

వేల సంవత్సరాల క్రితపు రచనా విశేషాలు చరిత్రకారులకు చిక్కు సమస్యలుగా తయారవడం మామూలే. ఎందుకంటే ప్రాచీన నాగరికతలన్నీ నేటిదాకా కొనసాగకుండా మధ్యలో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవే. అప్పటి లిపులూ, భాషలూ అన్నీ ఎటువంటి సజీవ సాక్ష్యాలనీ మిగల్చకుండా మరుగున పడిపోయినవే.

రోసెటా శిల

ఉదాహరణకు క్రీ.పూ. 3300 ప్రాంతాల మొదలై, 3 వేల ఏళ్ళు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఈజిప్ట్‌ నాగరికత ప్రాచీన గ్రీక్‌ పర్యాటకుల నుంచీ అనేకమందిని అద్భుతపరిచింది. అప్పటివారు నిర్మించిన బ్రహ్మాండమైన పిరమిడ్లనూ, దేవాలయాలనూ, ఇతర నిర్మాణాలనూ ఎందరో ఎంతో ఆసక్తితోనూ, ఆశ్చర్యంతోనూ పరిశీలించారు. కానీ వారి భాష గురించి తరవాతి యుగాల్లో ఎవరికీ తెలియలేదు. వారి చిత్ర లిపిని గురించి ఎందరో పరిశోధనలు జరిపినప్పటికీ నెపోలియన్‌ కాలందాకా అది చిక్కుముడిగానే మిగిలిపోయింది. ఎందరో విఫల యత్నాలు చేశాక 1821లో షాంపోలియోఁ అనే ఫ్రెంచ్‌ పరిశోధకుడి బృందానికి మూడు విభిన్న లిపులలో శాసనాలు చెక్కిన రోసెటా శిల ద్వారా సమాధానం లభించింది. అందులో ఒకే సమాచారాన్ని ప్రాచీన ఈజిప్ట్‌ చిత్రలిపిలోనూ, తరవాతి కాలపు డెమోటిక్‌ లిపిలోనూ, గ్రీక్‌ లిపిలోనూ రాసి ఉంచారు కనక ఎలాగో అలా తంటాలు పడి ఈజిప్ట్‌ చిత్రలిపిని చదవగలిగారు. అలాగే మెసపొటేమియావారి కీలలిపి (క్యూనీఫాం) నమూనాలు యూరప్‌నుంచి వెళ్ళిన అన్వేషకులకు పదిహేడో శతాబ్దంలోనే లభించాయి కాని వాటిలో ఒకటి మూడు విభిన్న లిపులు కలిగినది కావడంతో కొన్ని దశాబ్దాల పాటు పరిశీలనలు జరిపిన మీదట సమస్య పరిష్కారమయింది. మన దేశానికి మాత్రం అటువంటి అవకాశమేదీ లభించలేదు.

సింధు నాగరికత గురించి మొదటినుంచీ అనేక వివాదాస్పద సమస్యలుంటూనే ఉన్నాయి. మనవాళ్ళకు మొదటినుంచీ చారిత్రకదృష్టి కన్న సంప్రదాయబద్ధమైన వీరావేశాలు ఎక్కువ. హిందువులకు వేల సంవత్సరాలుగా వేదాల మీద అపారమైన విశ్వాసమూ, భక్తిశ్రద్ధలూ ఉన్నాయి. లోకాయత వాదమూ, బౌద్ధ జైనాలూ తప్ప తక్కిన భారతీయ తత్వ్తధోరణులన్నీ వేదాలను ప్రామాణికమైనవిగా భావిస్తాయి. అందుచేత అవి ఎవరూ రాయనటువంటి అపౌరుషేయాలనీ, బ్రహ్మముఖం నుంచి పుట్టుకొచ్చాయనీ నిజంగానే నమ్మేవాళ్ళు ఈనాటికీ చాలామంది కనిపిస్తారు. ఇటువంటి నమ్మకాలేవీ లేని చరిత్రకారులు మాత్రం క్రీ.పూ.1500 ప్రాంతాల రచించబడ్డట్టుగా వేదాలకు కాలనిర్ణయం చేశారు. సింధు నాగరికత మాత్రం అంతకు వెయ్యేళ్ళ ముందునుంచీ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అక్కణ్ణించీ చిక్కులు మొదలయాయి. ఆర్యులనబడేవారు మధ్య ఆసియా నుంచి మనదేశానికి వలస వచ్చారనీ, సింధు నాగరికత అప్పటికే వర్ధిల్లుతూ ఉందనీ చరిత్రకారులు అన్నారు. దీనర్ధం ఏమిటంటే స్థానికులది ద్రావిడ సంస్కృతి అని. దీనికి సనాతన హిందూ మతాభిమానులు అంగీకరించరు. వేదాలు రచించిన ఆర్య సంస్కారం ఈ ''పుణ్యభూమి''కి చెందినదేననీ, అంత గొప్ప ఆర్యజాతి మనకు విదేశీయం కాజాలదనీ ముఖ్యంగా ఉత్తరాదివారు వాదిస్తారు. ద్రావిడ సంస్కృతి అనేది ఏమైనప్పటికీ అది ఆర్య సంస్కృతి కన్నా నీచమైనదని వారు స్పష్టంగా అనకపోయినా వారి ఉద్దేశం అదే అనిపిస్తుంది. ఇంతకీ వేదాలది సంస్కృతభాష. (ఇది మనం అనుకునే సంస్కృతం కాదనీ, మరేదో దేవభాష అనీ చెప్పే మేధావులూ ఉన్నారు.) దీనికీ సింధులిపికీ ఏ సంబంధం కనబడదు.

సింధు నాగరికతలో దొరికిన ముద్రిక

సింధు నాగరికతలో దొరికిన లిపి ఆనవాళ్ళన్నీ ముద్రికల రూపంలో ఉన్న అచ్చులు. సుమారు 2 వేలకు పైగా దొరికిన ఈ ముద్రికలను బంకమట్టి ముద్దలవంటి వాటి మీద గుర్తులు వెయ్యటానికి ఉపయోగించి ఉంటారు. అక్కడివారికి అప్పటికే మెసపొటేమియా ప్రాంతం ప్రజలతో వర్తక వాణిజ్యాలు జోరుగా సాగుతూ ఉండేవి. సరుకుల బంగీల మీద ముద్రలు వేసి ఎగుమతి చేసేవారని మెసొపొటేమియాలోని సాక్ష్యాలవల్ల తెలుస్తోంది. అతిప్రాచీనమైన సింధునాగరికత ఎంత సువిశాలమైనదో ఆధునికులకు తెలియాలంటే అందులో ఈనాటి పాకిస్తాన్‌ పూర్తిగానూ, భారత, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల్లోని అనేక భాగాలూ ఉండేవనేది చెప్పాలి. 50 లక్షల జనాభాతో విలసిల్లిన ఈ నాగరికతకు చెందిన 800 కేంద్రాల ఆచూకీ ఇప్పటివరకూ తెలిసిందే. వీటిలో సింధునదీ తీరానా ఉన్నవి వందకు లోపే. ఇంత పెద్ద స్థాయిలో వర్ధిల్లిన నాగరికతలో లిపి ఉపయోగం జరిగే ఉండాలి. దురదృష్టవశాత్తూ మనకు దొరికిన ముద్రికల్లో ఏది చూసినా 5 నుంచి 26 గుర్తులే కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్షరాలా, పదాలా, శబ్దాలకు సంకేతాలా అనే విషయం 70 ఏళ్ళదాకా తెలియనేలేదు. ఆ తరవాత సోవియట్‌ యూనియన్‌, ఫిన్లండ్‌ మొదైన దేశాలకు చెందిన పరిశోధకులూ, భారత, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలూ కూడా పరిశీలనలు జరిపి ఈ లిపిని చదవగలిగే స్థాయికి చేరుకున్నారు. ఎటొచ్చీ వీరిలో తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి.

విస్తృతంగా పరిశీలనలు జరిపిన పార్‌స్పోలా (ఫిన్లండ్‌), అతనితో అంగీకరించిన ఐరావతం మహాదేవన్‌ తదితరులు ఈ భాష తమిళాన్ని పోలిన ద్రావిడభాష అని భావిస్తున్నారు. ఉత్తర భారతీయ పరిశోధకులైన మధుసూదన్‌ మిశ్రా వంటివారు మాత్రం అది తప్పనీ, ఆ గుర్తులన్నీ సంస్కృతాన్ని పోలిన అక్షరాలకు సంకేతాలనీ అంటున్నారు. కెనడాలోని పరిశోధకులు కొందరు మరికొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. సింధులిపికీ తెలుగు, తదితర ద్రావిడ భాషలకూ సంబంధం ఉండవచ్చని కొందరంటే, సింధులిపిని ఈనాటికీ వాడుతున్న ఆదివాసీ తెగలు బిహార్‌లో కనబడుతున్నాయని మరికొందరంటున్నారు. ఈ ప్రతిపాదనలకు కొంత ప్రాధాన్యత కనిపిస్తుంది. ఎందుకంటే సింధు నాగరికత ద్రావిడులకు సంబంధించనిదని అంటున్నవారు ముఖ్యంగా పేర్కొనే కారణం సింధునది ప్రాంతంలో తరవాతి కాలంలో ద్రావిడ సంస్కృతి కనబడటం లేదన్నదే. తరవాతి యుగాల్లో ఇండో ఇరానియన్‌ సంస్కృతికి చెందిన ప్రజలు చేసిన అనేక దాడుల కారణంగా ద్రావిడ సంస్కృతి తూర్పు దిక్కుకూ, దక్షిణాదికీ తరలి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రతిపాదనలే. వీటి నిరూపణకై ఎన్నో సాక్ష్యాలు సేకరించవలసి వుంది.

ఇవన్నీ అలా ఉంచితే అసలు లిపుల్లో అత్యంత ప్రాచీనమైనది సుమేరియన్‌ కీలపిలి కాదనీ, సింధు నాగరికతకు చెందినదేననీ 1999లో బిబిసి ప్రకటించింది. అయిదున్నర వేల ఏళ్ళనాటి కుండపెంకుల మీద గీసిన గుర్తులే ప్రపంచంలో అన్నిటికన్నా మొదటి లిపికి నమూనా అని పరిశోధకులు చెపుతున్నారు.

హడప్పా ప్రాంతంలో దొరికిన ఈ పెంకు మీద గుర్తులు కుండను ఆవంలో కాల్చక ముందూ, తరవాతా కూడా గీసినట్టుగా కనిపిస్తున్నాయని వారు చెప్పారు. ఈ గుర్తులకు కుండలోని పదార్ధంతోనో, దేవతలతోనో సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ లిపి గురించీ, తక్కిన నమూనాల గురించీ మనకేమీ తెలియకపోవడానికి కారణం ఈ భాషకు తరవాత వారసత్వమేదీ మిగలకపోవడమే. వేదకాలంలో లిపికి ప్రాధాన్యత ఉన్నట్టు కనబడదు. భరతదేశపు లిపులన్నిటికీ మూలమైన బ్రాహ్మీ లిపి క్రీ.పూ. నాలుగో శతాబ్దం తరవాత ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి నుండి తీసుకోబడినది)