మేధావుల హితవులే నన్ను నడిపించాయి - బిజినేపల్లి లక్ష్మికాంత గుప్త /


1"సుభాసుబోసు తమ్ములం సెభాసనండి మమ్ములన్‌' అంటూ విద్యార్థులచే లాంగ్‌ మార్చ్‌ చేయించిన, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి గ్రహీత బిజినేపల్లి లక్ష్మీకాంతగుప్త. నాటి నైజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి జైలు కేగిన సాహసి. పద్యమంటే బహుప్రీతి. 76 ఏళ్ళు ముదిమిలోనూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్న సాహితీ పిపాసి అతడు.
అతడి జ్ఞాపకాలు ఈ వారం.


నాదొక మధ్యతరగతి కుటుంబం. 1929 సంవత్సరం అక్టోబర్‌ 2వ తేదిన మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించాను. ఆదిలక్ష్మి, శంభయ్యలు నా జననీ జనకులు. నా తండ్రి వృత్తి చేత వణిజుడు (వైశ్యుడు). మా ఇంటి పేరు బాదం. కానీ నా ఊరిపేరే నా ఇంటి పేరయినది.
నా జీవితంలో సంభవించిన సంఘటనలు నన్నొక చదువరిగా, కవిగా ఎదగడానికి కారణమయ్యాయి. తెలంగాణ ప్రాంతంలోని అనేక గ్రామాలలో దొరలు ముస్లింలతో చెట్టా పట్టాలు వేసుకొని తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి, కొందరు గూండాలను చేరదీసి పోషించేవారు. అట్టి గ్రామాలలో మా గ్రామం ఒకటి. అచటి గూండాలు, రౌడీలు దుకాణాలకు వచ్చి తమకు, తమ యజమానులకు అవసరమున్నన్ని బట్టలు, నూనె, పప్పులు, బియ్యం, సిగరెట్లు ఇట్లా వివిధ వస్తువులు తీసుకువెళ్లేవారు. డబ్బులడిగితే నానా దుర్భాషలాడుతూ, ఒక్కోసారి చెయ్యి చేసుకునేవారు. నా పదేళ్ల వయసులో దుకాణంలో మా తండ్రికి తోడుగా నేనుండగా ఒక కానిస్టేబుల్‌ వచ్చి 'ఎస్‌.ఐ. గారికి నెయ్యి కావాలి' అన్నాడు. నా తండ్రి లేదన్నాడు. 'ఈ మాట నాతో కాదు, మా ఎస్‌.ఐ. గారితో చెప్పు, నడు' అన్నాడు. ఆ రోజుల్లో మా ఊరికి ఒక చిన్న పోలీస్‌స్టేషన్‌ మాత్రమే ఉండేది. ఆ ఎస్‌.ఐ. నాగర్‌ కర్నూల్‌ నుండి మా ఊరికి అప్పుడప్పుడు వచ్చేవాడు. నేను కూడా దుకాణం తలుపులు మూసి నా తండ్రి వెనకే వెళ్లాను. నేను చూస్తుండగానే ఆ ఎస్‌.ఐ. కళ్లెర్ర జేస్తూ ఉర్దూలో, ఇంగ్లీషులో దుర్భాషలాడుతూ నా తండ్రి చెంపపై చాచి కొట్టగా ఆ దెబ్బకు వృద్ధుడైన నా తండ్రి క్రింద పడిపోయాడు. ఆ సంఘటన నన్ను బాగా కలచివేసింది. నేను చిన్న వాడిని, ఏమీ చేయలేకపోయాను. నేనేమైనా అని ఉంటే నన్ను పుట్‌బాల్‌ ఆడుకునే అంత క్రూరుడు. వాని ఆగడాలనూ, అరాచకాలనూ అడిగే నాథుడు లేడు.

నాకు చదువుకోవాలనిపించాక మా నాన్నగార్ని బ్రతిమలాడి హైస్కూలు చదువులకై 1944 లో హైదరాబాదు వెళ్లాను. కాని 1946లో ఒక గూండా బెత్తం దెబ్బలకు వయో వృద్ధుడైన నా తండ్రి మంచాన పడ్డాడు. ఈ సంగతి తెలిసి హైద్రాబాదులో 9వ తరగతి చదువుతున్న నేను నా చదువుకు స్వస్తి చెప్పి వెళ్లిపోయాను. నిరుపేద కుటుంబమయిన కారణంగా 1947 జనవరి 30వ తేదీన ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాను. అదే సంవత్సరంలో నా తండ్రి సెప్టెంబర్‌ 10వ తేదీన కన్ను మూశారు. నా గ్రామానికి మిక్కిలి దూరంలో ఉన్న నేను నా తండ్రి దహన క్రియలకు కూడా హాజరు కాలేకపోయాను.

"వెళ్లితివా నా తండ్రి మమ్ములన్‌
విడనాడి ఇహలోక బంధముల్‌...''
అని
అలవోకగా నా నోటినుండి వెలువడిన దుఃఖపూరితమైన పాట విని ఇంటిల్లి పాదీ దుఃఖించారు. పిదప జాతిపిత 1948లో మరణించినపుడు కూడా చాలా దుఃఖించాను. 1946 లో మహాత్మాగాంధీని వరంగల్‌లో దర్శించుకొని ఉన్నందువలన వారి రూపాన్ని, నా తండ్రి రూపాన్ని నా కళ్లల్లో నిల్పుకొని ఖిన్నుడనయ్యేవాడిని. వారిద్దరి మరణమే నా కవితలకు ప్రేరణ. 1953లో మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో సురవరం ప్రతాపరెడ్డి గారు పోటీ చేశారు. ఎన్నికల అధికారి ఆదేశానుసారం నేను పోలింగ్‌ క్లర్కుగా అడ్డాకుల అనే గ్రామానికి వెళ్లాను. సురవరం ప్రతాపరెడ్డిగారు పర్యటిస్తూ అక్కడికి వచ్చారు. అంతకు ముందే వారు రచించిన 'ఆంధ్రుల చరిత్ర, గోలకొండ కవుల సంచిక, హిందువుల పండుగ, రామాయణ విశేషములు' అనే గ్రంథాలను చదివి యున్నందున వారంటే నాకు అమిత అభిమానము. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వలె కన్పించిన వారికి పాదాభివందనం చేశాను. నేను చిరుకవితలు, బుర్రకథలు రాస్తున్నానని మనవిచేయగా 'ఎలాంటివి' అని అడిగారు.

2"విదేశీయుల పాలనలో బానిసలుగా బ్రతికితి మానాడు/ వినండి ఘనమగు మన దేశానికి మనమే రాజుల మీనాడు/ కంటికి నిద్దుర వంటికి భద్రత లేని కాలముర ఆనాడు/ కనుమరుగయ్యెను దొరల జులుములు కునుకు పట్టినది ఈనాడు''
అనే కవిత వినిపించగానే ఆయన 'భేష్‌! బావుంది, ఈ కవితను మా గోలకొండ పత్రికకు పంపించు'' అన్నారు. ఆ విధంగా 1954 సంవత్సరంలో నా తొలి గేయ రచన 'ఆనాడు - ఈనాడు' శీర్షికతో గోలకొండలో ప్రచురితమైంది. అది నాకు పర్వదినమే కాదు, గర్వదినం కూడా. 1962- 63లో చైనా మన దేశంపై దురాక్రమణకు దిగినప్పుడు మహబూబ్‌నగర్‌ లో డా. సి. నారాయణరెడ్డి గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. వారితో అదే నా తొలి పరిచయం. ఆ సభలో నేను చదివిన కవిత అందరినీ ఎంతగానో అలరించింది. ఆ తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తులో జరిగిన కవిసమ్మేళనానికి నాకు ఆహ్వానం వచ్చింది. ఆ సభలో దాశరథి, జాషువా, ఆరుద్ర, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి మహాకవులెందరితోనో పరిచయ భాగ్యం కలిగింది.

దేశ స్వాతంత్య్రానంతరం భారత యూనియన్లో విలీనమగుటకు తిరస్కరించిన నిజాం నవాబుకు తోడు రజాకారులుద్భవించి, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించగా, తెలంగాణ ప్రాంతం అంతా అలజడులతో అట్టుడికి పోయింది, నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ చెప్పులతో కొట్టి, అవే చెప్పులు మెడలో వేసి రజాకార్లు ఊరంతా ఊరేగించేవారు. అలాంటి దుస్సంఘటనలు చూసి నప్పటికీ బలశాలి అయిన నా ప్రాణ మిత్రుడు గంగోజీ తోడుతీసుకొని వేదికలెక్కి బుర్రకథలు చెప్పేవాణ్ణి. రజాకర్ల దౌర్జన్యాలు ఎండగట్టి ప్రచారం చేసేవాణ్ణి. 1948లో పోలీసు చర్య జరిగింది. సైనికాధికారి జనరల్‌ జె.ఎన్‌.చౌదరి పర్యటిస్తూ మా ఊరికి కూడా వచ్చారు. మా బుర్రకథా గానంతో వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించగా వారు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం నా జీవితానికి ఒక మలుపే కాదు, ఒక గెలుపు. అనేక సభల్లో పాల్గొని నా ప్రచారగేయాలతో యువతలో చైతన్యం కలిగించాను. పోలీసు చర్యకంటే ముందు జైలు జీవితం కూడా అనుభవించాను. కొన్నాళ్లు జమ్మలమడుగులో తలదాచుకోవలసి వచ్చింది కూడా.

చిత్తూరు వి.నాగయ్య నటించిన యోగివేమన సినిమా చూసి, ప్రభావితుడనై వేమన పద్యాలకు అనుసృజనగా అనేక పద్యాలు వ్రాసి పగడాలమాలలో ప్రచురించాను. మచ్చుకు 'గంగిగోవు పాలు' అను వేమన పద్యానికి అనుసృజనగా-

'చిక్కనైన పాలు చెంబెడైనను చాలు
కడవడైన నేమి కల్తి పాలు'
అని రాశాను.
నా కృతిలో శుభాకాంక్షలు తెల్పుతూ సినారె గారు 'వేమన ఖరము పాల గురించి చెప్పాడు. ఇతడు కల్తీ పాలని, సమకాలీన సమాజంలోని బండారాన్ని బయట పెట్టాడు. వివేకమున్న కవి లక్షణం ఇది' అన్నారు. చాలా ఆటవెలదులు ఈ రకంగా చమత్క­ృతి మయంగా సాగినాయి.

ఒక బస్సు ప్రయాణంలో ప్రసిద్ధ సంస్క­ృత పండితులు తెలకపల్లి రామచంద్ర శాస్త్రి గారు పరిచయమయ్యారు. లఘు సిద్ధాంత కౌముది వ్యాకరణం నేర్చుకొనుటకు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారికి ఒక లేఖ రాసి నన్ను పంపించారు. నాడు ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉంటున్న దీపాల పిచ్చయ్య శాస్త్రి సన్నిధికేగి వారం రోజుల్లో వ్యాకరణం నేర్చుకొన్నాను. మునిమాణిక్యం నరసింహారావు, గడియారం రామకృష్ణ శర్మ, దేవులపల్లి రామానుజం గార్లు పరిచయం అయ్యారు. వారు నా కవితలకు పదును పెట్టిన సంఘటనలను మరువలేను. 1969లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పి.వి.నరసింహారావు అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనంలో "ఆంధ్రులు ఆరంభశూరులు కారు, ఆ రంభనే ధిక్కరించిన ధీశాలులు'' అనే పల్లవితో ఎలుగెత్తి నా గేయాన్ని విన్పించాను. నాటి సభకు విచ్చేసిన శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, ముకురాల రామారెడ్డి, సినారె, ముదిగొండ వీరభద్రయ్య లాంటి కవులు నా కవిత్వాన్ని ప్రశంసించిన విషయం నేనెప్పటికీ మరచిపోలేను.

1952లో ఒకసారి హైదరాబాదు నుండి అనంతపురానికి బస్సులో ప్రయాణిస్తుండగా నాతో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు వైద్య విద్యార్థులు తెలుగుభాష గురించి హీనంగా మాట్లాడటం సహించలేక వాళ్లిద్దరికీ తెలుగు భాష గొప్పతనాన్ని వివిరించాను. బస్సులో ఉన్నవారంతా చకితులై చూస్తుండగా మాకు కొంచెం ముందు కూర్చున్న ఒకతను చప్పట్లు చరుస్తూ 'భేష్‌!' అన్నారు. వారే తరిమెళ్ళ నాగిరెడ్డి అని తెలిసి ఆ«శ్చర్యపోయాను. వారు నీలం సంజీవరెడ్డిగారికి బావమరిది అవుతారని, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడని తెలిసి మరింత సంతోషం కలిగింది.

నేను 1959 నుండి 1962 వరకు మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాదులో హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన కూడా మరవలేనిదే. న్యూయార్క్‌ యూనివర్సిటీ నుండి ఒక యువకుడు నల్లమల ప్రాంతంలో నివసించే వారి జీవన స్థితిగతుల్ని గురించి రీసెర్చి నిమిత్తం వచ్చానని పరిచయం చేసుకున్నాడు. సకల సదుపాయాలు కల్గివున్న ఒక వాహనంతో మా హైస్కూలు ఆవరణలో ఉండేవాడు. అతను నేను రోజూ చెప్పే పాఠాలు వింటూ తనకు కూడా తెలుగు నేర్పమని అన్నాడు. 'నాకు ఇంగ్లీషు ధారాళంగా నేర్పండి మరి' అన్నాను. అతను 'సరే'నన్నాడు. అదేమి విచిత్రమో కానీ ఒక్క నెలలోనే 'అ ఆ'లతో ఆరం భించిన ఆయన పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము, మిత్ర భేదములను అనర్గళంగా చదివేదాకా వచ్చాడు. తాను అమెరికా బయలుదేరేప్పుడు 'ఈ జాన్‌ పాల్‌ మిములను మరువలేడు'' అంటూ నా చేతిలో నాలుగువేల రూపాయలను ఉంచాడు. నాకు ఆనందాశృవులు ఆగలేదా సమయంలో. అదొక అపురూపమైన జ్ఞాపకం.

1987 అక్టోబర్‌లో రిటైరై, హైదరాబాద్‌లోనే నా పిల్లల వద్ద శేష జీవితాన్ని గడుపుతున్నాను. 2004లో నా పుట్టినరోజునాడు నా సంతానంతో పాటు, నా శ్రేయోభిలాషులు నాకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవం నిర్వహించారు. ఆనాటి సభకు ఆర్థిక మంత్రి రోశయ్య వచ్చి, 'ఆత్మసాక్షి నివేదన' అనే నా కృతిని ఆవిష్కరించడం మరో మరువలేని రోజు.

- సేకరణ : భీంపల్లి శ్రీకాంత్‌